ఇటీవల కరోనా వైరస్ బారినపడిన టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఇపుడు ఆ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ ఫలితం వచ్చింది.
రెండు వారాల క్రితం అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్వారంటైన్‌లో ఉంటూ ఆయన చికిత్స తీసుకున్నాడు. తనకు నెగెటివ్ నిర్ధారణ అయిందంటూ బన్నీ ఈ రోజు ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు.
"ప్రతి ఒక్కరికీ హాయ్.. 15 రోజుల క్వారంటైన్ తర్వాత నాకు కరోనా నెగెటివ్ నిర్ధారణ అయింది. నేను కోలుకోవాలని ప్రార్థనలు చేసిన నా శ్రేయోభిలాషులకు, అభిమానులకు కృతజ్ఞతలు. కరోనా కేసులు తగ్గడానికి ఈ లాక్‌డౌన్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అందరూ సురక్షితంగా ఇంట్లోనే ఉండండి. మీరు చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞతలు" అని బన్నీ ట్వీట్ చేశాడు.
కాగా, దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తుండగా, ప్రతినాయకుడిగా ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నాడు.
ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగుకు అంతరాయం ఏర్పడటంతో, దసరాకి విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారనే టాక్ కూడా వచ్చింది.
ఈ సినిమా నిడివి ఎక్కువగా వస్తుందని భావించిన సుకుమార్, రెండు భాగాలు చేసి విడుదల చేద్దామని నిర్మాతలతో చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. అందుకు వాళ్లు అంగీకరించినట్టుగా కూడా చెప్పుకున్నారు.
కానీ అలా చేస్తారా? అనే సందేహం అభిమానుల్లో ఉంది. కానీ ఇది నిజమేననే విషయాన్ని నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ చెప్పారు. సుకుమార్ .. బన్నీ అంతా చర్చించే ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పారు. అయితే ముందుగా లీక్ అయిన విషయం ప్రకారం దసరాకి ఒక భాగం .. వచ్చే వేసవి సెలవుల్లో ఒక భాగం వస్తాయేమోయ.