హీరో విజయ్ దేవరకొండ ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ 'లైగర్' (సాలా క్రాస్‌బ్రీడ్). డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందిస్తోన్న ఈ మూవీకోసం అభిమానులు, సాధారణ ప్రేక్షకులు అత్యంత క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. పూరి కనెక్ట్స్ అసోసియేషన్‌తో బాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ ధర్మా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
లైగర్ మూవీ ముంబైలో నిర్మించిన భారీ సెట్లో ఇటీవల షెడ్యూల్ పూర్తి చేసుకుంది. జాకీ చాన్ మరియు అనేక ఇతర హాలీవుడ్ యాక్టర్స్‌తో కలిసి పనిచేసిన హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించిన ఇంటెన్స్ యాక్షన్స్ సీక్వెన్సెస్ ను పర్యవేక్షించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆండీ లాంగ్ కు చెందిన విదేశీ బృందం ఈ యాక్షన్ సన్నివేశాలలో పాల్గొంది.
మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో సరికొత్తగా కనిపించ బోతున్నారు. అతి త్వరలోనే నెక్ట్స్ షెడ్యూల్ జరపడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.
బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా, లావిష్‌గా ప్యాన్ ఇండియా లెవల్‌లో లైగర్ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. క్రేజీ కాంబినేషన్‌తో నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి విష్ణుశర్మ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, హిరూ యశ్ జోహార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో నిర్మాణమవుతోంది.