భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దిగ్గజ గాయని ఆశా భోంస్లే (91) మరణించారంటూ సోషల్ మీడియాలో వ్యాపించిన ఓ వార్త తీవ్ర కలకలం రేపింది. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో, క్షేమంగా ఉన్నారని ఆమె కుమారుడు ఆనంద్ భోంస్లే స్పష్టం చేశారు. అభిమానులు, సంగీత ప్రియులు ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ఎంత వేగంగా వ్యాపిస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, జూలై ఒకటో తేదీన షబానా షేక్ అనే ఫేస్బుక్ యూజర్ ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఆశా భోంస్లే చిత్రానికి దండ వేసి, "ప్రముఖ గాయని ఆశా భోంస్లే కన్నుమూశారు ఒక సంగీతశకం ముగిసింది" అనే క్యాప్షన్‌ను జతచేశారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో, పలువురు అభిమానులు దిగ్భ్రాంతికి గురై సంతాప సందేశాలు పెట్టడం ప్రారంభించారు. దీంతో గందరగోళం నెలకొంది. అయితే, మరికొందరు నెటిజన్లు ఈ వార్త నిజానిజాలను నిర్ధారించుకోవాలని సూచించారు.
ఈ వదంతులు వ్యాపించడంతో, పలు ప్రముఖ మీడియా సంస్థలు రంగంలోకి దిగి నిజ నిర్ధారణ చేపట్టాయి. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పాయి. ఇదేసమయంలో ఆశా భోంస్లే కుమారుడు ఆనంద్ భోంస్లే కూడా స్పందించారు. ఓ ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ, "ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు" అని క్లుప్తంగా, స్పష్టంగా తెలియజేశారు.