దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, నాజర్, సత్యరాజ్, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కించిన చిత్రం "బాహుబలి 2 ది కంక్లూజన్". ఏప్రిల్ 28వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు భారతీయ చిత్ర పరిశ్రమలో నమోదైవున్న రికార్డులను బద్ధలుకొడుతూ... అనితర సాధ్యమైన రికార్డులను సాధిస్తూ దూసుకెళ్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో 9000 థియేటర్లలో విడుదలై 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. 'సర్కార్-3', 'మేరీ ప్యారీ బిందు' వంటి బాలీవుడ్ చిత్రాలు విడుదలైనా 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమ ముందు నిలబడలేక పోయాయి.
కేవలం తెలుగు, తమిళ, మలయాళ సినీ పరిశ్రమల్లోనే కాకుండా, హిందీలో సైతం 'బాహుబలి-2: ద కన్ క్లూజన్'కి ఎదురేలేకుండా పోయింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలై 20 రోజులు పూర్తి కాకుండానే 1500 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా, ప్రస్తుతానికి ఏకైక భారతీయ సినిమాగా 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా నిలిచింది.
ఇంకోవైపు.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరిట ఉన్న రికార్డులన్నీ బద్ధలైపోయాయి. తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్స్ రూ.105 కోట్లు సాధించిన మూవీగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఎంథిరన్ (రోబో) చిత్రం ఉంది. ఈ సినిమా విడుదలై ఏడేళ్లవుతోంది. ఇప్పటివరకు తమిళ చిత్ర పరిశ్రమలో ఆ సినిమాపై ఉన్న అత్యధిక వసూళ్లను బాహుబలి-2 తుడిచిపెట్టేసింది. పైగా, శరవేగంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా బాహుబలి నిలిచింది.
'బాహుబలి-2' విడుదల రోజే రజనీకాంత్ 'కబాలి', విజయ్ 'భైరవ'ల రికార్డులని బద్ధలు కొట్టగా, ఇపుడు తమిళనాడు రాష్ట్రంలోనూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి-2 మరో ఘనతను సొంతం చేసుకుంది. పైగా, ఇప్పటికీ ఈ చిత్రం ఇప్పటికీ 90 శాతం ఆకుపెన్సీతో ప్రదర్శించబడుతోంది. ఇక తెలుగు రాష్ట్రాలలో బాహుబలి-2 చిత్రం 285 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టగా, కేరళలో 50 కోట్లు కలెక్షన్స్ సాధించింది. బాలీవుడ్ లో 434.80 కోట్ల వసూళ్ళు సాధించిన విషయం తెల్సిందే.