తెలుగు సినిమా వైపు ప్రపంచాన్ని తిరిగి చూసేలా చేసిన బాహుబలి మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కేవలం తెలుగులోనే కాక అనేక భాషలలో ఈ చిత్రం పలు రికార్డులు క్రియేట్ చేసింది. 2017లో ఇండియాలో అత్యధిక సినీ ప్రేక్షకులు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు? ఆసక్తికరమైన ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ఓర్మాక్స్ సంస్థ ఓ సర్వే చేసి ఫలితాలు వెలువరించింది.
ఇందులో 51% మంది ప్రేక్షుకులు బాహుబలి ది కంక్లూజన్ కే ఓట్ చేశారు. ఆ తర్వాత షారుక్ ‘రాయీస్’ సినిమాకి 21%, సల్మాన్ ‘ట్యూబ్ లైట్’ కి 6%, రజనీ ‘రోబో-2’కు 2% మాత్రమే ఓట్లతో సరిపుచ్చారు. బాహుబలి తొలి భాగంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ట్విస్టే అభిమానులలో ఇంత ఆసక్తిని పెంచిందని చెప్తున్నారు.
ఇదిలా ఉంటే.. రాజమౌళి ‘బాహుబలి’ కోసం మహిష్మతి రాజ్యాన్ని ఆవిష్కరించిన తీరు మొత్తం భారతీయ సినీ పరిశ్రమనే విస్మయానికి గురి చేసింది. ఇప్పుడు అమరావతి కోసం కూడా జక్కన్న విజన్‌ను ఉపయోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో రాజమౌళి సలహాలు తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు.
అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయ ఆకృతుల రూపకల్పనలో రాజమౌళి పాత్ర ఉండాలని బాబు భావిస్తున్నారు. జక్కన్న సలహాలు తీసుకోవాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) అధికారులను ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. ‘బాహుబలి-2’ పూర్తయిన తర్వాత ఇందుకోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తానని రాజమౌళి చెప్పినట్లు తెలిసిందే.
ఇక శంకర్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న '2.0' చిత్రానికి కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే వచ్చినట్టు ఓర్మాక్స్ పేర్కొంది. బాహుబలి రెండో భాగం కోసం దక్షిణాది ప్రేక్షకుల కన్నా, ఉత్తరాదివారే అధిక ఆసక్తితో ఎదురు చూస్తున్నట్టు ఈ సర్వే వెల్లడించింది.