దేశాన్ని ఊపేస్తున్న 'బాహుబలి' మానియా... దంగల్‌ను దాటేసింది... ఒక్క రోజులో వన్ మిలియన్ టికెట్స్ సేల్

గురువారం, 27 ఏప్రియల్ 2017 (13:36 IST)
'బాహుబలి' మానియా దేశాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. దీనికి నిదర్శనమే ఒక్క రోజులోనే ఏకంగా పది లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. తద్వారా ఇప్పటివరకు 'దంగల్' చిత్రం పేరిట ఉన్న రికార్డును బాహుబలి అధికమించింది. 
 
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ఇప్పటికే భారత చిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులను సృష్టించింది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 24 గంటల్లో ఒక మిలియన్‌ టికెట్లు అమ్ముడుపోయినట్లు ప్రముఖ ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయ పోర్టల్‌ వెల్లడించింది. దీనికి ముందు ఆన్‌లైన్‌ ద్వారా అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన సినిమా అమిర్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘దంగల్‌’.
 
బాహుబలి చిత్రంపై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనడంతో పాటు ఈ చిత్రంలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవాలన్న ఆసక్తే దీనికి కారణంగా ఉంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి: ది కన్‌క్లూజన్‌ శుక్రవారం 9 వేల థియేటర్లలో విడుదల కాబోతోంది. దేశవ్యాప్తంగా 6,500 థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో అభిమానులు ఇప్పటికే థియేటర్ల వద్ద టికెట్ల కోసం బారులు తీరారు. కొన్ని చోట్ల 144 సెక్షన్ అమలు చేసిమరీ టిక్కెట్లు అమ్ముతున్నారు. 
 
మరోవైపు... ప్రముఖ టికెట్ల ఆన్‌లైన్‌ విక్రయ పోర్టల్‌ ‘బుక్‌ మై షో’లో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ సినిమాకు సంబంధించిన టికెట్లను అందుబాటులోకి తీసుకురాగా 24 గంటల్లో ఒక మిలియన్‌ టికెట్లు అమ్ముడుపోయినట్లు సదరు పోర్టల్‌ సిబ్బంది ఆశిశ్‌ సక్సేనా వెల్లడించారు. రికార్డు స్థాయి బుకింగ్‌ని తాము ఊహించలేదని, దక్షిణాదిప్రాంతాల్లో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయాయని, ఒక్క రోజుకే ఇంత భారీ రెస్పాన్స్‌ రావడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. 

వెబ్దునియా పై చదవండి