ఇది సినీపరిశ్రమకు, సినీకార్మికులకు కష్టకాలం. ఉపాధి లేక బతుకు తెరువు లేక ఇబ్బందులు పడుతున్న సమయమిది. ఇలాంటి సమయంలో మెగాస్టార్ ప్రారంభించిన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) వేలాది కార్మికుల్ని ఆదుకుంది. ఇప్పటికే ఒక దఫా నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేసి ఆదుకున్నారు. రెండో దఫా నిత్యావసరాల్ని సీసీసీ కమిటీ సరఫరా చేస్తోంది. మా సభ్యులకు కొంతమందికి రెండో దఫా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీసీసీ కమిటీ సభ్యుడు బెనర్జీ మాట్లాడుతూ-``ఇది చిరంజీవి గారి ఐడియా. సినీకార్మికులకు సాయపడాలని సీసీసీ ప్రారంభించారు. దీనికి హీరోలు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు.. అలాగే బయటి నుంచి దాతలు సాయం చేశారు. ఇండస్ట్రీలోని ఆర్టిస్టులు.. టెక్నీషియన్లు సహా కార్మికులెందరికో పనుల్లేక డబ్బుల్లేక ఇబ్బందులు తలెత్తాయి.
ఈ కార్యక్రమంలో మూవీ ఆర్టిస్టుల సంఘం ఉపాధ్యక్షురాలు హేమ, కమిటీ సభ్యులు ఏడిద శ్రీరామ్, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. సీసీసీ నుంచి నిరంతరం ఈ సేవలు అందుతాయని వీరంతా వెల్లడించారు. అలాగే ఇటీవల కొంతమంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు మా ట్రెజరర్ రాజీవ్ కనకాల నిత్యవసర సరుకులు అందించడం జరిగింది.