సుశాంత్ ఆత్మహత్య కేసు : యేడాదిగా పత్తాలేని క్లోజ్ ఫ్రెండ్... అపుడు మాత్రం హడావుడి..

బుధవారం, 26 ఆగస్టు 2020 (08:02 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టిన తర్వాత అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రధానంగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితో పాటు సుశాంత్ క్లోజ్ ఫ్రెండ్, ఫిల్మ్ మేకర్ సందీప్ ఎస్ సింగ్ పాత్రలపై ఇపుడు సందేహాలు నెలకొన్నాయి. ముఖ్యంగా, తాను సుశాంత్‌కు అత్యంత దోస్త్‌ను అని చెప్పుకునే సందీప్ గత యేడాది కాలంగా ఒక్క ఫోన్ కాల్ చేయకపోవడం ఇపుడు పలు అనుమానాలకు తావిస్తోంది. 
 
పైగా, సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించే సమయంలో ఉన్నట్టుండి ప్రత్యక్షమే హడావుడి చేయడం కూడా ఇపుడు చర్చనీయాంశంగా మారింది. అందుకే రియా చక్రవర్తి, సందీప్ ఎస్ సింగ్‌ల పాత్రలపై సీబీఐ దృష్టిసారించింది. ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే సీబీఐ సేకరించిన పలు ఆధారాలతోనే రియా చక్రవర్తిని అరెస్టు చేయవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇపుడు సందీప్ కూడా ఆ జాబితాలో చేరారు. దీనికి బలమైన కారణాలు కూడా లేకపోలేదు. 
 
సుశాంత్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకునే ఫిల్మ్ మేకర్ సందీప్ ఎస్ సింగ్ కాల్ రికార్డ్స్ బయటకు వచ్చాయి. ఓ మీడియా సంస్థ వీటిని సంపాదించింది. దాని కథనం ప్రకారం.. సందీప్ మీడియాతో మాట్లాడిన ప్రతిసారీ సుశాంత్ తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెబుతుండేవాడు. అంత దగ్గరి స్నేహితుడని చెప్పే సందీప్ గత 12 నెలల కాలంలో ఒక్కసారి కూడా సుశాంత్‌కు కాల్ చేసింది లేదని కాల్ రికార్డ్స్ ద్వారా తెలుస్తోంది. దీనిని బట్టి అతడి మాటలకు, చేతలకు పొంతన లేదన్న విషయం బయటపడింది. 
 
జూన్ 14న సుశాంత్ చనిపోయిన తర్వాత సందీప్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. సుశాంత్ ఇంటి వద్ద పోలీసు వ్యవహారాలు చూసుకున్నాడు. సుశాంత్ పోస్టుమార్టం జరిగిన కూపర్ ఆసుపత్రిలో జరగాల్సిన అన్ని పనులు పూర్తిచేశాడు. అంబులెన్స్‌లోనూ కూర్చున్నాడు. అంత్యక్రియలకు హాజరయ్యాడు. సుశాంత్‌తో తనకున్న స్నేహం గురించి మీడియాకు వివరించాడు. 
 
సుశాంత్ మరణం తర్వాత తన సినిమా 'వందే భారతం' పోస్టర్‌ను షేర్ చేశాడు. ఈ సినిమాలో సుశాంత్‌ హీరో. ఇప్పుడీ సినిమాను సుశాంత్ జ్ఞాపకంగా పూర్తిచేసి విడుదల చేయాలని నిర్ణయించాడు. ఆ తర్వాత మిన్నకుండిపోయాడు. ఇదే పలు అనుమానాలకు తావిస్తోంది. 
 
అంతేనా.. సుశాంత్ మరణించిన 5 రోజుల తర్వాత అంటే జూన్ 19న తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘమైన భావోద్వేగ పోస్టును షేర్ చేశాడు. సుశాంత్‌ను అంకిత ఎలా సేవ్ చేసిందీ అందులో రాసుకొచ్చాడు. వారిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని అనుకునేవాడినని పేర్కొన్నారు. 
 
అయితే, సుశాంత్ కుటుంబ సభ్యుల కథనం మరోలా ఉంది. సందీప్ ఎస్ సింగ్ ఎవరో తమకు తెలియదని, సుశాంత్‌కు అతడు దగ్గరి స్నేహితుడన్న విషయం తమకు ఏమాత్రం తెలియని పేర్కొన్నారు. సుశాంత్ సిబ్బంది కూడా సందీప్ గురించి తమకు తెలియదని చెప్పడం గమనార్హం. ఇప్పుడు కాల్ రికార్డ్స్ మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
 
కూపర్  ఆసుపత్రికి సందీప్ ఎందుకెళ్లాడు? లేదంటే, ఇంకెవరైనా అతడిని పంపి ఉంటారా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఇప్పటికైతే ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. ప్రస్తుతం సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితానీ, కుక్ నీర్ సింగ్‌లను మంగళవారం మరోమారు ప్రశ్నించింది కూడా. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు