తన అభిమానులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ పిలుపునిచ్చారు. అభిమానులు శాంతియుతంగా ఉండాలని, ఎలాంటి విధ్వంసాలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తిచేశారు. టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రోత్సాహంతో యువ నటి శ్రీరెడ్డి తనపై చేసిన వ్యక్తిగత దూషణల విషయంపై తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9 కొన్ని రోజులుగా ఉదయం నుంచి రాత్రి వరకు అసభ్యకరంగా డిబేట్లు నిర్వహించిందంటూ పవన్ మండిపడిన విషయం తెల్సిందే. టీవీ9 శ్రీని రాజు ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఆయనపై పవన్ తీవ్ర ఆరోపణలు కూడా చేశారు.
'రేపు శ్రీని రాజు తనపై పరువునష్టం దావా వేస్తున్నారని, తన ఫ్యాన్స్ శాంతియుతంగా ఉండాలని, ఎటువంటి విధ్వంసకర చర్యలకు పాల్పడకూడదని కోరారు. అలాగే, తాను కూడా ఆ ఛానెల్ హెడ్‌లపై సుదీర్ఘంగా న్యాయపరమైన యుద్ధం చేస్తానని ప్రకటించారు. అలాగే మరో ట్వీట్ చేస్తూ, మన సోదరీమణులు, అమ్మలు, కూతుళ్లను దుర్భాషలాడుతూ కథనాలు ప్రసారం చేసే టీవీ9, టీవీ5, ఏబీఎన్ ఛానళ్లను బహిష్కరించాలని, నిస్సహాయులైన వారికి సాయం చేయాల్సిందిపోయి, వారిని అశ్లీలంగా చూపిస్తూ వ్యాపారం చేసుకోవాలని ఆ ఛానల్స్ చూస్తున్నాయని, వాటిని బాయ్‌కాట్ చేయాలని అన్నారు.