రేపు విడుదల కానున్న అజ్ఞాతవాసి సినిమా కోసం పవన్ అభిమానులు ఆత్రుతగా వేచి చూస్తున్నారు. త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫ్రెంచ్ సినిమా లార్గో ఫించ్‌కు ఇండియాలో రీమేక్ హక్కులు ఉన్న టీ సిరీస్‌కు సినిమా ప్రివ్యూ చూపించడంతో కాపీ అంటూ వచ్చిన వార్తలు కూడా నిజం కాదని తేలిపోయింది. అయితే ప్రివ్యూ చూసిన టీ సిరీస్ ప్రతినిధులు సినిమా అద్భుతంగా ఉందని చెప్పినట్లు సమాచారం. ఓ విధంగా ఈ వివాదం కూడా సినిమా ప్రచారానికి బాగా ఉపయోగపడింది.
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల సిఎంలు సినిమాకు అదనపు షోలు వేసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో, 3000కు పైగా థియేటర్స్‌లో విడుదల చేసి, మొదటిరోజే భారీ రికార్డులు నెలకొల్పడానికి ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో కనీసం రెండు రోజులపాటు 90 నుండి 95 శాతం థియేటర్లలో అజ్ఞాతవాసి సినిమానే ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి పాజిటివ్ టాక్ తోడైతే బాహుబలి2 కలెక్షన్‌లను మించిపోతుందని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు అమెరికాలో అజ్ఞాతవాసి హక్కులను పొందిన తెలుగు సంస్థ ఎల్ఏ ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాను విడుదల చేయని రీతిలో ఏకంగా 580 చోట్ల రిలీజ్ చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే పవన్, త్రివిక్రమ్‌ను అమెరికాకు తీసుకెళ్లి కలెక్షన్లు రాబట్టాలని యోచిస్తోంది. ఇక్కడ ప్రీమియర్ షోలతోనే రెండు మిలియన్ డాలర్లు వసూలు కావచ్చని అంచనా వేస్తున్నారు.