13న అతిలోక సుందరి జయంతి : నెట్టింట సీబీఐ ఎంక్వైరీ ఫర్ శ్రీదేవి వైరల్

బుధవారం, 12 ఆగస్టు 2020 (15:56 IST)
బాలీవుడ్ బ్యూటీ, అలనాటి అందాల నటి, అతిలోక సుందరి శ్రీదేవి జయంతి ఆగస్టు 13వ తేదీన జరుగనుంది. ఈ వేడుకలను జరుపుకునేందుకు శ్రీదేవి భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో పాటు శ్రీదేవి కుమార్తెలు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, శ్రీదేవి అభిమానులు మాత్రం ఈ జయంతి వేడుకల వేళ ఓ హ్యాష్‌ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. 
 
ఇంత‌కూ ఆ హ్యాష్ ట్యాగ్ ఏంటో తెలుసా? 'సీబీఐ ఎంక్వైరీ ఫ‌ర్ శ్రీదేవి'. దాదాపు రెండున్న‌రేళ్ల త‌ర్వాత శ్రీదేవి అభిమానులు ఇలా సోష‌ల్ మీడియాలో ఇంత‌లా ర‌చ్చ చేయడానికి కార‌ణ‌మెవ‌రో తెలుసా? బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. 
 
ఈయన ఇటీవల తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఈయ‌న మ‌ర‌ణంపై బాలీవుడ్‌లో పెనుదుమార‌మే చెలరేగింది. సుశాంత్ కేసును బీహార్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్ర‌భుత్వం సీబీఐకి అప్ప‌గించింది. 
 
అలాంట‌ప్పుడు అనుమానాస్పదంగా దుబాయ్‌లో చ‌నిపోయిన శ్రీదేవి మ‌ర‌ణంపై ఎందుకు సీబీఐ విచార‌ణ చేయ‌లేదని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె అభిమానులు ఉద్య‌మం చేస్తున్నారు.
 
కాగా, ద‌క్షిణాది, ఉత్త‌రాది చిత్రాల్లో న‌టించి నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్‌ను పెళ్లి చేసుకుంగి. ఈమెకు ఇద్దరు కుమార్తెలు. అయితే, ఈమె 2018 ఫిబ్ర‌వ‌రి 24న దుబాయ్‌లోని ఓ నక్షత్ర హోటల్‌ రూం బాత్ ట‌బ్‌లో ప‌డి చ‌నిపోయారు. 
 
ఈమె మృతిపై ఆమె అభిమానులు చాలా మంది ఇంకా అనుమానాలను వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. అందుకే ఇపుడు ఆమె అభిమానులు సీబీఐ ఎంక్వైరీ ఫర్ శ్రీదేవి అంటూ ఓ హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు