భాగ్య‌రాజా మోసం చేశాడా! 25 ఏళ్ళ‌కు బ‌య‌ట‌ప‌డ్డ ర‌హ‌స్యం

శనివారం, 29 మే 2021 (18:29 IST)
Bhagyaraja, KL. Narayana
సినిమా నిర్మాత‌గా క‌న్‌స్ట్ర‌క్ష‌న్ రంగం నుంచి వ‌చ్చిన వ్య‌క్తి డా. కె.ఎల్‌. నారాయ‌ణ‌. దుర్గా ఆర్ట్స్ బేన‌ర్‌పై ప‌లు సినిమాలు చేశాడు. క్ష‌ణం క్ష‌ణం అనేది రామ్‌గోపాల్ వ‌ర్మ‌తో ఆయ‌న తీసిన మొద‌టి సినిమా. మూడో సినిమాగా వెంక‌టేష్‌తో `ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు` నిర్మించారు. ఈ సినిమా విడుద‌లై ఈనెల‌కు 25 సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆ సినిమా గురించి కొత్త విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు నిర్మాత‌. ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు సినిమా ఓ త‌మిళ సినిమాకు రీమేక్ అని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. కానీ అప్ప‌ట్లో దానిపై పెద్ద‌గా క్లారిటీ ఇవ్వ‌లేదు ఆయ‌న ఎందుకంటే ఆ సినిమా బాగానే ఆడింది. ఇప్పుడు 25 ఏళ్ళ సంద‌ర్భంగా ఆయ‌న ఈ విష‌యాన్ని బ‌య‌ట పెట్టారు.
 
ఆయ‌న మాటల్లోనే విందాం. భాగ్య‌రాజాగారు ఇ.వి.వి. స‌త్య‌నారాయ‌ణ‌గారికి లైన్ చెప్పార‌ట‌. ఇది బాగుంది. ఒక‌సారి న‌న్ను కూడా విన‌మ‌ని ఇవివిగారు చెబితే నేను చెన్నై వెళ్ళి విన్నా. నాతోపాటు సినిమాటోగ్రాఫ‌ర్ ఎస్‌. గోపాల్‌రెడ్డిగారు కూడా వ‌చ్చారు. క‌థ విన్నాక‌. ఆయ‌న వ‌ద్ద కొనుగోలు చేశాం. అంతేకానీ అది రీమేక్ కాదు. ఇక ఆ త‌ర్వాత క‌థ హీరో వెంక‌టేష్‌గారికి చెప్పాం. ఆయ‌న విని వెంట‌నే చేద్దాం అన్నారు. సినిమా షూటింగ్ మొద‌లు పెట్టాం. దాదాపు పూర్త‌యింది. పోస్ట్‌ఫ్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. మే23న సినిమాను విడుద‌ల చేయాల‌ని డిసైడ్ అయ్యాం.
 
స‌రిగ్గా ఆ స‌మ‌యంలోనే మా సంస్థ మేనేజ‌ర్ చెన్నై నుంచి ఫోన్ చేశారు. సార్‌. మార్చిలో ఇక్క‌డ ఓ సినిమా విడుద‌లైంది. అది స‌రిగ్గా మ‌న సినిమా క‌థ‌లాగే వుంది. ఒక‌సారి రండి చూద్దురుగానీ అన్నాడు. వెళ్ళి చూశాం. అయితే ఆ త‌ర్వాత తెలిసింది ఏమంటే, ఆ క‌థ‌ను ఆయ‌న ఓ త‌మిళ నిర్మాత‌కు ఇచ్చాడ‌ట‌. అక్క‌డ మోస్త‌రు హీరోతో చేశారు. అప్పుడు మాకు టెన్ష‌న్ మొద‌లైంది. సేమ్ క‌థ‌. ఇది తేడా కొడితే మ‌న సినిమాపై ప్ర‌భావం ప‌డుతుంది అని భ‌య‌ప‌డ్డాం. చేసేది లేదు. పూర్తిగా సినిమా తీసేశాం. అందుకే ధైర్యంగా ముందుకు సాగాం. ఇక ఆ సినిమా త‌మిళ్‌లో ఆ హీరో స్థాయికి త‌గిన‌ట్లుగానే ఆడింది. ఇక తెలుగులో మా సినిమా వెంక‌టేష్ క‌నుక ఇక్క‌డా బాగానే ఆడి మా బేన‌ర్‌కు మంచి పేరు తెచ్చింది. అని వివ‌రించారు. సో. సినిమా క‌థ‌లు ఇలానే వుంటాయి. ఇలా బోల్డ‌ని క‌థ‌లు ఒక‌రికి ఇద్ద‌రికి చెప్ప‌డం. అమ్మేయ‌డం మామూలే. అందుకే సినిమా అంతా మాయ‌లోకం అంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు