హీరో మహేష్ బాబుకు మే నెల ఫీరవర్ పట్టుకుంది. దీనికి బలమైన కారణం లేకపోలేదు. గతంలో ఆయన నటించిన 'నాని', 'నిజం', 'బ్రహ్మోత్సవం' వంటి చిత్రాలు మే నెలలో విడుదలై డిజాస్టర్ ఫ్లాప్‌లను మూటగట్టుకున్నాయి. ఈ పరిస్థితుల్లో మే నెల 9వ తేదీన మహేష్ నటించిన తాజా చిత్రం "మహర్షి" విడుదల కానుంది. దీంతో మహేష్‌తో పాటు ఆయన అభిమానులకు మే నెల ఫీవర్ పట్టుకుంది.
ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తామని చెప్పిన చిత్ర బృందం మేలో రిలీజ్ అనే సరికి మహేష్ అభిమానులలో టెన్షన్ మొదలైంది. అందుకు కారణం గతంలో మహేష్ నటించి మే నెలలో విడుదలైన డిజాస్టర్ చిత్రాలే. దీంతో మహేష్‌కు మే నెల ఏమాత్రం అచ్చిరాదని వారు అంటున్నారు.
కానీ, చిత్ర నిర్మాతలు మాత్రం మేలో వస్తున్న 'మహర్షి' మాత్రం మంచి హిట్ అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. అశ్వినీదత్ నిర్మించిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'మహానటి' మే 9వ తేదీన విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ సాధించాయి. అలాగే, దిల్ రాజు బ్యానర్‌లో వచ్చిన పరుగు, భద్ర కూడా మంచి హిట్ సాధించాయి.
ఈ క్రమంలో మేలో విడుదల కానున్న 'మహర్షి' చిత్రం కూడా భారీ హిట్ కొడుతుందని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఇక్కడ మహేష్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా లేదంటే నిర్మాతల సెంటిమెంట్ వర్కవుట్ అవుందా అనేది చూడాలి. 'మహర్షి' చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.