ఈనెల 19న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే ఈవెంట్ ప్రకటన

డీవీ

శనివారం, 4 మే 2024 (14:53 IST)
Dasari jayanthi sabha
దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకలను నేడు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, దర్శకులు అనిల్ రావిపూడి, వశిష్ట, గోపీచంద్ మలినేని, విజయ్ కనకమేడల, శంకర్, రేలంగి నరసింహారావు, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, నిర్మాత సి కల్యాణ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ఫిలింనగర్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమ రెడ్డి, నిర్మాత ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫిలింఛాంబర్ ప్రాంగణంలోని దాసరి నారాయణరావు విగ్రహానికి పూలమాలలు వేశారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ ను ఈ నెల 19న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆ ఈవెంట్ డేట్ పోస్టర్ ను తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
 
 ఈ సందర్భంగా దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ - దాసరి గారు దర్శకుల సంఘానికే కాదు అన్ని సినీ కార్మిక సంఘాలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ముందుకొచ్చేవారు. సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉండేవారు. దాసరి గారి 151 సినిమా సందర్భంగా 151 మంది దర్శకులకు సన్మానం జరిపారు. ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్న కళాతపస్వి కె విశ్వనాథ్ గారు దాసరి గారి పుట్టినరోజుని డైరెక్టర్స్ డేగా జరపాలని సూచించారు. ఇద్దరు పెద్ద దర్శకుల మధ్య ఉన్న అనుబంధానికి గుర్తు ఈ సంఘటన. డైరెక్టర్స్ డే ఈవెంట్ ను ఈ నెల 19వ తేదీన జరబోతున్నాం. ఈ ఈవెంట్ సక్సెస్ కోసం మన యంగ్ డైరెక్టర్స్ అందరూ శ్రమిస్తున్నారు. వాళ్లందరికీ నా థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
 
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ - దాసరి గారి జయంతి సందర్భంగా డైరెక్టర్స్ డే ను ఇండోర్ లో జరుపుకునేవాళ్లం. పెద్ద ఈవెంట్ లా ఎందుకు చేయడం అని నాకు అనిపించేది. కానీ దాసరి గారి గొప్పదనం ప్రపంచానికి తెలియాలంటే భారీ ఈవెంట్ గానే చేయాలని వీరశంకర్ చెప్పిన మాటతో ఏకీభవిస్తున్నాను. ఇందుకు పెద్ద దర్శకులంతా ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. వాళ్లు వస్తే హీరోలు వస్తారు. అప్పుడే ఈవెంట్ సక్సెస్ అవుతుంది. ఈ దిశగా ప్రయత్నం చేస్తున్న దర్శకుల సంఘం కమిటీని, కల్చరల్ కమిటీని అభినందిస్తున్నాను. అన్నారు.
 
నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ - దాసరి గారిని 40 ఏళ్ల క్రితం మొదటిసారి కలిశాను. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ఇవాళ ఎంతోమంది ఆయన జయంతి కార్యక్రమానికి వస్తున్నారు. అలా ఒక దర్శకుడిని స్మరించుకోవడం గతంలో ఎప్పుడూ జరగలేదు. తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆదరించేవారు దాసరి, వారి కష్టం తెలుసుకుని సాయం చేసేవారు. అలాంటి గొప్ప లక్షణం ఉండబట్టే ఇప్పటికీ దాసరి గారిని గుర్తుపెట్టుకుంటున్నాం. ఇండస్ట్రీలో ఎవరికి సమస్య వచ్చినా పెద్ద దిక్కుగా ఉండేవారు. అలా మరో దర్శకుడు ఎవరూ చేయలేకపోయారు. దాసరి గారికే సాధ్యమైంది. అన్నారు.
 
నిర్మాత సి కల్యాణ్ మాట్లాడుతూ - దర్శకుల సంఘంతో పాటు 24 క్రాప్టులకు సంఘాలు పెట్టడంలో దాసరి గారి కృషి ఎంతో ఉంది. అందువల్లే ఇవాళ దేశవ్యాప్తంగా సినీ కార్మిక సంక్షేమంలో టాలీవుడ్ నెంబర్ వన్ గా ఉంది. ఇది దాసరి గారి చలవే. డైరెక్టర్స్ డే ఈవెంట్ ఘనంగా చేయడం ఇప్పుడున్న కమిటీకే సాధ్యమవుతుంది. మీకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అన్నారు.
 
తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమ రెడ్డి మాట్లాడుతూ - దర్శకరత్న దాసరి గారు దర్శకత్వంతో పాటు మాటలు, పాటలు రాశారు. యాక్టింగ్ లోనూ ప్రతిభ చూపించారు. సినీ పరిశ్రమకు ఎంతోమంది దర్శకులను అందించారు. ఆయన కీర్తి టాలీవుడ్ లో శాశ్వతంగా నిలిచిపోతుంది. అన్నారు
 
ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ - దాసరి గారు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆయన లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. డైరెక్టర్స్ డే ఈవెంట్ కు మా 24 కార్మిక సంఘాల నుంచి ఏ సహకారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. అన్నారు.
 
దర్శకుడు శంకర్ మాట్లాడుతూ - దాసరి గారు ఇండస్ట్రీకి ఒక ఆపదమొక్కుల వాడు, ఆపద్భాందవుడు. ఆయన స్థాపించిన డైరెక్టర్స్ అసోసియేషన్ ఇవాళ ఇంతగా ఎదిగింది. గతంలో డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ జరిపినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు మన డైరెక్టర్స్ ట్రస్ట్ కు 25 లక్షల రూపాయలు విరాళం అందించారు. అప్పటి నుంచి డైరెక్టర్స్ డే అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అందుకు చిరంజీవి గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. డైరెక్టర్స్ డే ఈవెంట్ కు మా దర్శకుల అందరి సపోర్ట్ ఉంటుంది. ఘనంగా నిర్వహించాలి, ఏవైనా పొరపాట్లు జరిగినా సర్దుకుపోవాలని సూచిస్తున్నా. అన్నారు.
 
ఫిలింనగర్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ - ఫిలింనగర్ లో ఫిలిం ఇండస్ట్రీ ఇంత గొప్పగా ఎదిగేందుకు దాసరి గారి దూరదృష్టి కారణం. ఫిలింఛాంబర్ తో సహ దేవాలయం వంటివి నిర్మించుకున్నారు. ఇక్కడ ఛాంబర్ ప్రాంగణంలో దాసరి గారి విగ్రహం ఉన్నంతకాలం ఆయన మన మధ్యే ఉన్నట్లు భావించుకోవాలి. అన్నారు.
 
దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ - దర్శకరత్న దాసరి గారితో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన దర్శకుడు కాకముందు నేను ఆయన దగ్గర చేరాను. అప్పటి నుంచి ఎన్నో ఏళ్లు గురువు గారితో ప్రయాణం సాగించాను. డైరెక్టర్స్ డేను దర్శకుల సంఘం ఘనంగా నిర్వహించాలని ముందుకు రావడం సంతోషకరం. అందుకు సహకరిస్తున్న పెద్ద దర్శకులు అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. వారి సమయం ఎంతో విలువైనది. అయినా గురువు గారి మీద అభిమానంతో వారంతా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ - దాసరి గారితో మా కుటుంబానికి బంధుత్వం ఉంది. ఆయన పుట్టినరోజున ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెబితే వంద రూపాయల నోటు మీద సంతకం చేసి ఇచ్చేవారు. అలాంటి నోట్లు నా దగ్గర ఐదారు ఉన్నాయి. దాసరి గారి పుట్టినరోజున డైరెక్టర్స్ డే ఈవెంట్ ను ఘనంగా చేయబోతున్నారు. ఆ ఈవెంట్ దిగ్విజయం కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ - ఈ రోజు మనం ఈ ఫిలింఛాంబర్ కార్యాలయంలో కార్యక్రమం జరుపుకుంటున్నాం అంటే అది దాసరి గారి వల్లే. ఆయన దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, రచయితగా, ప్రెస్ ఓనర్ గా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగుకే కాదు మద్రాస్ మూవీ ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలాంటి ఒకే ఒక్కడు దాసరి గారు. అన్నారు.
 
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ - మే 19న డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం. ఆ రోజు ఐపీఎల్ మ్యాచ్ ఉంది. నేను ఇటీవల ఐపీఎల్ గురించి మాట్లాడిన మాటలు తప్పుగా కన్వే అయ్యాయి. ఐపీఎల్ చూడండి, సినిమాలూ చూడండి, నేనూ ఐపీఎల్ చూస్తుంటాం. నేను మాట్లాడింది అపార్థం చేసుకోవద్దు. దర్శకరత్న దాసరి గారి జయంతి రోజు ప్రతిసారీ మనమంతా ఇలాగే కలవాలని కోరుకుంటున్నా. డైరెక్టర్స్ డే ఈవెంట్ కోసం మా దర్శకులంతా సిద్ధమవుతున్నాం. స్కిట్స్, మంచి మంచి పోగ్రామ్స్ చేయబోతున్నాం. ఇది మన సంఘం కోసం, మన సభ్యుల సంక్షేమం కోసం చేస్తున్నది. ఈ కార్యక్రమం ద్వారా పోగయ్యే ప్రతి రూపాయి డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులకు ఉపయోగపడుతుంది. అన్నారు.
 
దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ - డైరెక్టర్స్ డే సందర్భంగా నా సాటి దర్శకులందరికీ శుభాకాంక్షలు. దాసరి గారు నా మొదటి సినిమా డాన్ శీను ఆడియో ఫంక్షన్ కు గెస్ట్ గా వచ్చి ఆశీర్వదించారు. ఆ తర్వాత బలుపు సినిమా చూసి బాగుందని ప్రశంసించారు. నేను దర్శకుడిగా పేరు తెచ్చుకుంటానని ఆశీర్వదించారు. దాసరి గారి ఆశీస్సులు మనందరితో ఎప్పుడూ ఉంటాయి. డైరెక్టర్స్ డే ఈవెంట్ ను మనమంతా ఘనంగా జరుపుకోవాలి. అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు