విశాఖ ఉక్కు అసలు చరిత్ర తెలుసా! బీహార్‌లో రైతులు ఎందుకు కూలీలయ్యారో చెప్పనా!
గురువారం, 12 ఆగస్టు 2021 (12:27 IST)
R. Narayanamurthy
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది అందరికీ తెలిసిందే. కానీ అలా అడిగింది అసలు ఆంధ్రులు కాదు. ఈ నిజం మీకు తెలుసా! అదేవిధంగా బీహార్‌లో రైతుల్ని కూలీలుగా మార్చింది ఎవరో తెలుసా? ఉచితాలు, రాయితీలు అంటూ ప్రభుత్వం ఎందుకు ఇస్తుందో చెప్పనా? అంటూ నిజా నిజాలు వెల్లడించారు విప్లవ సినిమాల కథానాయకుడు ఆర్. నారాయణమూర్తి. ఆయన నటించిన సినిమా `రైతన్న`. ఈనెల 14న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా ఆయనతో చిట్‌చాట్.
రైతుల గురించి చాలా సినిమాలు వచ్చాయి? మరి మీ రైతన్నలో ఏం చెప్పబోతున్నారు?
మొదటినుంచి దేశంలో కొందరు సామ్యవాదం, మరికొందరు పెట్టుబడిదారీవైపు మొగ్గుచూపుతూనే వున్నారు. చాలా దేశాలు సామస్యవాదంపై వున్నాయి. అయితే నా సినిమాలో చూపిన రైతు పోరాటం అనేది ప్రభుత్వాలను విమర్శిస్తూ తీయలేదు. కేవలం ప్రభుత్వ పాలసీలనేవి ప్రజలకు చేరాలి. వాస్తవం ఏమిటో తెలియాలి అనేది చెప్పాను. ఎన్నో పోరాటాలు రైతులు చేశారు. చేస్తున్నారు. ఇటీవలే ఢిల్లీలో కరోనా టైంలోకూడా రైతులు ఉద్యమించారు. ఏం? ఎందుకని ప్రభుత్వం పట్టించుకోదు? ప్రశ్నిస్తే ఫైరింగ్ చేస్తారా? బేడీలు వేస్తారా?
నా సినిమాలో కూడా గద్దర్ ఓ పాట పాడారు. సందర్భానుసారంగా.. రైతన్నకు బేడీలెందుకురోరన్నా, మొక్కలు నాటిన కూలీను జైలులో పెట్టిండ్రోరన్నా. అంటూ సాగే ఆ పాట సినిమాకు హైలైట్ అవుతుంది.
మరి బీహార్‌లో రైతుల పరిస్థితి ఎందుకు మార్పుచెందింది?
కరెక్ట్ పాయింట్. ఒకే దేశం ఒకే రూల్ అని 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఓ రూల్ పెట్టింది. రైతులు పండించే పంటను ప్రభుత్వంతో నడిచే కొనుగోలు కేంద్రాలు మార్కెట్ యార్డ్‌లు (మండీస్) మధ్యవర్తిత్వం లేకుండా వుండాలని తీర్మానించింది. అయితే దానివల్ల మేలు జరగలేదు. కీడే జరిగింది. ఎందుకంటే రైతులకు ఎక్కవరేటుకు ఇచ్చినట్లు ఇచ్చి వారి కబంధహస్తాలతో నొక్కేసింది. దాని ద్వారా రైతు కూలీగా మారిపోయాడు. ప్రస్తుతం బీహార్‌లో రైతులు లేరు. అంతా కూలీలే. అలా భారత్ లో ఇతర రాష్ట్రాలలో కూడా చాపకింద నీరులా సాగుతుంది. పెట్టుబడిదారి పెత్తనం వచ్చేస్తుంది. ప్రభుత్వం వారికి అనుకూలంగా మతలబులాంటి జీవోలు పెట్టి చదువురాని రైతులను మోసం చేస్తుంది. మేం కూలీలం కాము. మాకు కార్పొరేట్ వ్యవసాయం వద్దు అని నమ్మి నేను సినిమా తీశాను.
ఇటీవలే మీరు కూడా విశాఖ ఉక్కు మన హక్కు అన్నారు. కానీ కేంద్రం తనపని తాను చేసుకుంటూపోతుంది? దీన్ని ఎలా విశ్లేషిస్తారు?
యస్ కరెక్టే. విశాఖ ఉక్కు అసలు చరిత్ర ఇప్పటి తరానికి తెలీదు. 1964లోనే పుట్టిన ఉద్యమం. నేను హైస్కూల్ చదువుతున్నా. మన వాల్ళు ఉద్యమం చేస్తుంటే విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అంటూ అప్పట్లో అరిచాం కూడా. అప్పట్లో అమృతరావు అనే నాయకులు ఆమరణదీక్ష చేశారు. అసలు విశాఖలో ఫ్యాక్టరీ కావాలని ఆంధ్రులు అడగలేదు. అప్పటి ఇందిరాగాంధీ హయాంలో కేంద్రప్రభుత్వమే ఇక్కడ ఓడరేవు వుంది. వ్యాపారానికి బాగుంటుందని గ్రహించి ఓ కమిటీని వేసింది. ఆ కమిటీ వారు సర్వేచేసి రికమండ్ చేశారు. అప్పుడు మనకు ఇక్కడ ఫ్యాక్టరీ కావాలి అంటూ అప్పటి మన నాయకులు నినదించారు. అలా అప్పటి కాంగ్రెస్ నాయకులు ముందుకు వచ్చారు. మొదట్లో 9మంది విద్యార్థులు బలిదానం చేశారు. ఆ తర్వాత పోరాటం ఉదృథం అవడంతో 32మంది బలిదానాలు జరిగాయి. ఆ ప్రభావంతో 68 మంది ఎం.ఎల్.ఎ.లు. 7గురు ఎం.పీలు రాజీనామా చేశారు.
తరిమిల నాగిరెడ్డి, గౌతులచ్చన్న వంటి ఎందరో నాయకులు పోరాటం చేశారు. మరోవైపు అమృతరావు అనే పోరాటయోదుడు ఆమర నిరాహారదీక్ష చేస్తున్నాడు. ఆయన చనిపోయే దశలో వున్నాడు. ఇవన్నీ అప్పటి ఇందిరాగాంధీకి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి వివరించారు. 32మంది బలిదానం, 9మంది విద్యార్థులు చనిపోవడం, ఎం.ఎల్.ఎ. ఎం.పి.లు రానీజానామతో కేంద్రం దిగి వచ్చింది. అలా వచ్చిన ఫ్యాక్టరీ చాలా సంవత్సరాలు లాభాలతో నడించింది. గత మూడేళ్ళుగా ప్రపంచ ఆర్థిక మాద్యంవల్ల దానిపై పడి నష్టాల్లో నడుస్తుంది. మరలా పుంజుకుంది. మరి ఎందుకు ప్రైవేట్‌పరం చేయాలి? ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను అడిగాను.
ప్రభుత్వం ఉచిత పాలసీలపై మీరెలా స్పందిస్తారు?
అసలు ఉచితం, రాయితీలు అనేవి ఎందుకు ఇవ్వాలి? ప్రజల్ని బానిసలుగా మార్చడానికే గదా. ఇంకెంతకాలం. రైతుబంద్, రైతులకు ఉచిత కరెంట్, రుణ మాఫీ ఇవన్నీ ఎందుకండి. ఎవరు అడిగారు?
ముంబైలో ఉచిత విద్య లేదు. కరెంట్ అంతా రిలయన్స్ చేతిలో వుంది. బిల్లు కట్టకపోతే కట్. ఆరుగాలం కష్టపడి పండించే రైతుకు అతివృష్టి అనావృష్టి అనేవి వెంటాడుతంటాయి. అప్పు దొరకదు. దొరికితే అధిక వడ్డీ, పంట రాకపోతే ఆత్మహత్య. ఆ తర్వాత ప్రభుత్వం ఏవో రాయితీలు. ఇవన్నీ ట్రాష్. విద్యుత్‌ను ప్రైవేట్ పరం చేయకండి అని వేడుకుంటున్నాను.