పాఠశాల ల్లో పాఠ్య అంశం గా భగవద్గీతను చేర్చాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

డీవీ

శుక్రవారం, 8 మార్చి 2024 (15:45 IST)
Dr. LV Gangadhara Shastri receiving the award from Draupadi Murmu
ప్రసిద్ధ గాయకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి - భారత రాష్ట్రపతి గౌII శ్రీమతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ప్రతిష్ఠాత్మక 'కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు-2023" ను అందుకున్నారు. సంపూర్ణ భగవద్గీతలోని 700 శ్లోకాలను,  స్వీయ సంగీతం లో, తాత్పర్య సహితం గా గానం చేసి, అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, లోకార్పణ చేసినందుకు  'భారతీయ ప్రధాన సాంప్రదాయ సంగీత విభాగంలో ఆయనను ఈ అవార్డు తో భారత ప్రభుత్వం గౌరవించింది.

ఈ కార్యక్రమం న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్  లో మార్చ్ 6, 2024 న జరిగింది. గౌ II రాష్ట్రపతి తో పాటు  కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖామాత్యులు శ్రీ జి కిషన్ రెడ్డి, కేంద్ర చట్టము మరియు న్యాయ మంత్రిత్వ శాఖ, పార్లమెంట్ వ్యవహారాలు మరియు సాంస్కృతిక  శాఖామాత్యులు శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్, సంగీత నాటక అకాడమీ ఛైర్పర్సన్ శ్రీమతి సంధ్య పురేచ, కేంద్ర సాంస్కృతిక శాఖ సెక్రటరీ శ్రీ గోవింద్ మోహన్ లు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. 
 
Dr. LV Gangadhara Shastri receiving the award from Draupadi Murmu
కార్యక్రమానంతరం శ్రీ గంగాధర శాస్త్రి పాత్రికేయులతో మాట్లాడుతూ - " గతం లో  డా ఏ పి జె అబ్దుల్ కలాం గారికి నా భగవద్గీత వినిపించి ప్రశంసలు పొందడం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి 'కళారత్న', మధ్యప్రదేశ్ లోని పాణిని యూనివర్సిటీ నుంచి 'గౌరవ డాక్టరేట్', ఇప్పుడు భారత రాష్ట్రపతి గౌ II  శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా 'సంగీత నాటక అకాడమీ' అవార్డు అందుకోవడం, అందునా నా తల్లితండ్రులు ఆరోగ్యం గా ఉన్నప్పుడే ఈ జాతీయ అవార్డు అందుకోవడం అసలైన  ఆనందాన్నిస్తోంది. ఈ SNA అవార్డు నా 'గీతా' పరిశ్రమను గుర్తించి శ్రీ జి కిషన్ రెడ్డి గారు అందించినదిగా భావిస్తాను. జన్మనిచ్చిన తల్లితండ్రులకు, మాతృభూమికి, మాతృదేశానికి ఇంతకంటే తిరిగి ఏమివ్వగలను.

ఈ అవార్డులూ ప్రశంసలూ అన్ని నా భగవద్గీతా మార్గానికే రావడం ఆత్మానందాన్ని కలగజేస్తోంది. ఇది ఏదీ నా ఒక్కడి ప్రతిభ కాదు. నేను నిమిత్తమాత్రుడిని..  అనుకోని నా గీతా ప్రయాణమంతా కృష్ణ పరమాత్ముని సంకల్పం.. నా తల్లి తండ్రుల తపఃఫలం..!  అయితే  నా పరమ లక్ష్యం మాత్రం అవార్డులు కాదు. - 'ఇంటింటా గీతా జ్యోతులు వెలగాలి. ముఖ్యం గా ఈ దేశం లోని ప్రతి ఒక్క హిందువూ భగవద్గీత చదవాలి ... అర్ధం చేసుకోవాలి... ఆచరించాలి... తరువాత తరాలకు అందించాలి.. తద్వారా సనాతన ధర్మాన్ని కాపాడాలి...!  భారతీయ ఆధ్యాత్మికత దేశ కాల జాత్యాదులకు అతీతమైనది. కుల మత వర్గ లింగ విభేదాలకు తావులేనిది .. దీనిని ప్రపంచ వ్యాప్తం చేయడం ద్వారా స్వార్ధ రహిత ఉత్తమ సమాజాన్నీ, విశ్వ శాంతినీ సాధించవచ్చు.. అప్పుడే మాకు అసలైన ఆనందం. మా లాంటి ధర్మ ప్రచారకుల వ్యవస్థల గురించి తెలుసుకుని ప్రభుత్వమే చేయూతనివ్వాలి. చేయూతకోసం మేము ప్రభుత్వాలను అర్ధించే  పరిస్థితి ఉండరాదు. గీతను జాతీయ గ్రంథం గా ప్రకటించాలి. పాఠశాల ల్లో పాఠ్య అంశం గా  భగవద్గీతను చేర్చాలి. అప్పుడే మనం మన దేశ  అస్థిత్వాన్ని కాపాడుకున్నట్టు. భగవద్గీతను మతం అనే కోణం నుంచి చూడవద్దు. అలా ఐతే ఇంగ్లీషు నేర్చుకోవడం క్రైస్తవం అవుతుంది కదా...!. అందరినీ సమానం గా చూడమని చెప్పే ధర్మ మూర్తులు శ్రీరాముడు, శ్రీకృష్ణులకు జన్మనిచ్చిన భారత భూమిపై పుట్టినందుకు గర్వపడతాను."  అన్నారు గంగాధర శాస్త్రి. కేంద్ర సంగీత నాటక అకాడమీ ఛైర్పర్సన్ శ్రీమతి సంధ్య పురేచా శ్రీ గంగాధర శాస్త్రిని దుశ్శాలువతో సత్కరిస్తూ - త్వరలో తమ అకాడమీ తరపున గీత ద్వారా ధర్మ ప్రచార కార్యక్రమాలను కూడా వేదికలపైన నిర్వహించబోతున్నట్టు చెబుతూ అందుకు గంగాధర శాస్త్రి సహకారాన్ని కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు