'ద్యావుడా' చిత్ర దర్శకుడుని హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. శివుడు, శివలింగాలకు సంబంధించిన అసభ్యకర సన్నివేశాలను యూట్యూబ్‌లో పెట్టినందుకు ఆయనను ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మల్కాజ్‌గిరి డీసీపీ కె.రమేష్, అల్వాల్ ఏసీపీ సయ్యద్ రఫీక్ కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దాసరి సాయిరాం (25) హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో ఉంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం 'ద్యావుడా' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల సాయిరాం, నిర్మాత గజ్జెల హరికుమార్‌రెడ్డి కలిసి చిత్రంలోని కొన్ని ప్రచారచిత్రాలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.
నేరేడ్‌మెట్‌కు చెందిన భజరంగ్‌దళ్ కార్యకర్త యు.నవీన్ అందులో శివుడు, శివలింగాలకు సంబంధించి అభ్యంతరకరమైన దృశ్యాలున్నట్లు గుర్తించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాచిగూడలోనూ మరో ఫిర్యాదు అందింది. నేరేడ్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసి రాచకొండ ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులకు అప్పగించారు. తనపై కేసు నమోదైందన్న విషయం తెలుసుకున్న సాయిరాం ఎవరికీ కనిపించకుండా పారిపోయారు. దీంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా, సాయిరాంను గురువారం అరెస్టు చేశారు. నిర్మాత హరికుమార్‌రెడ్డి పరారీలో ఉన్నాడు.