ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం - ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు!

ఠాగూర్

బుధవారం, 8 జనవరి 2025 (16:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థులపై మానసిక ఒత్తిడిని తగ్గించే చర్యల్లో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేసింది. ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి మాత్రమే ఇకపై పబ్లిక్ పరీక్షలను నిర్వహిస్తారు. సీబీఎస్ఈ విధానంతో ముందుకు సాగుతామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. జాతీయ నూతన విద్యా విధానం చట్టాన్ని అనుసరించి ఈ సంస్కరణలు చేపట్టినట్టు వెల్లడించారు. 
 
సైన్స్, ఆర్ట్స్, లాంగ్వేజ్ సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తామని ఆమె తెలిపారు. రానున్న విద్యా సంవత్సరం 2025-26 నించి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఎన్సీఈఆర్టీ పుస్తకాలను ప్రవేశపెడుతున్నామని, దీనివల్ల నీట్, జేఈఈ వంటి జాతీయ పోటీ పరీక్షలకు సులభతరం అవుతుందని చెప్పారు. సీబీఎస్ఈ విద్యా విధానంతో ఇకపై ముందుకు సాగుతామన్నారు. ఇక నుంచి మొదటి సంవత్సరం పరీక్షలను ఆయా కాలేజీలే అంతర్గతంగా నిర్వహిస్తాయని, ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను మాత్రం ఇంటర్ బోర్డు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ సంస్కరణలపై ఈ నెల 16వ తేదీలోపు సూచనలు, సలహాలు పంపించవచ్చని పేర్కొన్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు