కుటుంబం, ప్రేమ, పెళ్ళి, పిల్లలు, తల్లిదండ్రులు అక్కాచెల్లెళ్ల మధ్య మమతలతో కూడిన మానవీయ అంశాలతో దర్శకుడు శేఖర్ కమ్ముల తీసిన మనోహర దృశ్య కావ్యం ఫిదా ప్రేక్షకులను ఫిదా చేయడమే కాకుండా రోజురోజుకూ భారీ కలెక్షన్లను రాబడుతోంది. సినిమా చాలా బాగుంది అనే ఒకే ఒక్క నోటిమాటతో ఫిదా కలెక్షన్ల దుమ్ము రేపుతోంది. తెలంగాణ భాష యాసకు పట్టం కడుతూ రైతుకుటుంబాల్లోని నిర్మల మానవ సంబంధాలను శిఖరస్థాయిలో చూపించిన ఫిదా సినిమా భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమా చూసిన తరువాత ప్రేక్షకులతో పాటు చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియాలో చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా సాయిపల్లవి నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమాతో మెగా హీరో వరుణ్ తేజ్ తొలి కమర్షియల్ హిట్ అందుకున్నాడు.