నా అనేవాడే నీ మొదటి శత్రువు.. అదే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం : దర్శకుడు కృష్ణ చైతన్య

డీవీ

బుధవారం, 29 మే 2024 (16:25 IST)
Gangs of Godavari Director Krishna Chaitanya
విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి". శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. దర్శకుడు కృష్ణ చైతన్య సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
 
"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" ప్రయాణం ఎలా మొదలైంది?
దర్శకుడిగా ప్లానింగ్ లో ఉన్న చిత్రాలు ఆలస్యం అవటం, మరీ గ్యాప్ ఎక్కువైపోతోంది అనే భయం నాలో మొదలైంది. అదే విషయాన్ని త్రివిక్రమ్ గారితో పంచుకున్నాను. ఆయన సూచనతో విశ్వక్ కి కథ చెప్పాను. విశ్వక్ కి కథ నచ్చడంతో అలా ఈ సినిమా ప్రయాణం మొదలైంది.
 
ఈ సినిమా ఎలా ఉండబోతుంది?
గోదావరి అనగానే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉంది అన్నట్టుగా చూపిస్తారు. కానీ నిజానికి మా ప్రాంతంలో కూడా నేరాలు జరుగుతాయి. ప్రాంతాలను బట్టి కాకుండా మనుషులను బట్టి నేరాలు జరుగుతాయి. ఆ ఆలోచన నుంచి పుట్టినదే ఈ కథ. అయితే ఇది కల్పిత కథనే. దీనిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే.. దీని ద్వారా ఒక మంచి కథను చూపించవచ్చు, ఒక మంచి ఎమోషన్ ను చూపించవచ్చు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ విజువల్ ని చూపించవచ్చు అని భావించాను. నా ఆలోచనకు తగ్గట్టుగా సితార లాంటి మంచి నిర్మాణ సంస్థ దొరికింది. కొందరు ఇది గ్యాంగ్ స్టర్ మూవీ అనుకుంటున్నారు. కానీ ఇది గ్యాంగ్ స్టర్ మూవీ కాదు.
 
విశ్వక్ సేన్ కోసం కథలో ఏమైనా మార్పులు చేశారా?
విశ్వక్ కోసం ఎటువంటి మార్పులు చేయలేదు. మొదట ఏదైతే కథ రాసుకున్నామో.. అదే విశ్వక్ తో చేయడం జరిగింది. అయితే విశ్వక్ తెలంగాణలో పెరిగిన వ్యక్తి కాబట్టి.. గోదావరి మాండలికాన్ని సరిగ్గా చెప్పగలడా అని కొంచెం సందేహం కలిగింది. కనీసం రెండు మూడు నెలలు ట్రైనింగ్ అవసరమవుతుంది అనుకున్నాను. కానీ నెల రోజుల లోపులోనే నేర్చుకొని ఆశ్చర్యపరిచాడు.
 
ట్రైలర్ లో కొన్ని సంభాషణలు అభ్యంతరకరంగా ఉన్నాయి.. దీనిపై మీ అభిప్రాయం?
మా సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. సంభాషణల పరంగా రెండు చోట్ల మాత్రమే మ్యూట్ వేశారు. అవే మీరు ట్రైలర్ లో చూశారు. ట్రైలర్ కి సెన్సార్ అభ్యంతరాలు ఉండవు. అందుకే ఆ సన్నివేశాల్లోని భావోద్వేగాన్ని బాగా అర్థమయ్యేలా చెప్పడం కోసం ఆ సంభాషణలను ట్రైలర్ లో అలాగే ఉంచడం జరిగింది. సినిమాలో మాత్రం ఆ రెండు అభ్యంతరకర పదాలు వినిపించవు.
 
సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా గురించి?
యువన్ శంకర్ రాజా లాంటి ప్రముఖ సంగీత దర్శకుడితో పని చేయాలంటే మొదట భయపడ్డాను. ఆయన స్థాయికి నా మాట వింటారా అనుకున్నా. కానీ ఆయన మాత్రం తన అనుభవంతో.. నేను కోరుకున్నట్టుగా, సినిమాకి కావాల్సిన అద్భుతమైన సంగీతాన్ని అందించారు.
 
దర్శకుడిగా సినిమా చూసి సంతృప్తి చెందారా?
ఇది నాకు చాలా చాలా ఇష్టమైన కథ. ఆ ఇష్టంతోనే ఈ సినిమా చేశాను. నేను అనుకున్న భావోద్వేగాలు తెరమీద చక్కగా పలికాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మాత్రం హృదయాన్ని హత్తుకుంటాయి.
 
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' గురించి ఒక్క మాటలో చెప్పాలంటే..?
మహా భారతంలోని "నా అనేవాడే నీ మొదటి శత్రువు" అనే మాట నాకు చాలా ఇష్టం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. "నా అనేవాడే నీ మొదటి శత్రువు" అనే మాటే చెబుతాను.
 
మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ను ఎవరితో చేయాలని ఉంది?
నాకు పవన్ కళ్యాణ్ గారంటే ఎప్పటి నుంచో అభిమానం. ఆ అభిమానం మాటల్లో చెప్పలేనిది. ఆయనతో సినిమా చేసే అవకాశం రావాలని కోరుకుంటాను.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు