వారి వల్లే ఇండస్ట్రీకి వచ్చా- కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ అనేలా సినిమా తీసా :నిర్మాత పెట్లా ర‌ఘురామ్‌ మూర్తి

శనివారం, 29 జులై 2023 (17:20 IST)
Petla Raghuram Murthy
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా ర‌ఘురామ్‌ మూర్తి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రాజేష్ దొండపాటి తెరకెక్కించిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 4న రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత పెట్లా ర‌ఘురామ్‌ మూర్తి పలు విషయాలు తెలిపారు.
 
నేను ఉద్యోగరిత్యా సాఫ్ట్ వేర్ అయినా కూడా నాకు సినిమాలంటే చాలా ఇష్టం. ఆరేళ్ల క్రితం నాకు సినిమాల మీద ఓ ఆలోచన పుట్టింది. ఎప్పుడూ మనం సినిమాలను చూడటమేనా? మనం ఎందుకు తీయలేమని నాలో ఆలోచన పుట్టింది. అలా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. 
 
- హైదరాబాద్‌లో మైక్రో సాఫ్ట్‌లో పని చేస్తుండగా.. ఓ స్నేహితుడు కథలు రాస్తుండేవాడు. ఎన్నో సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గానూ పని చేశాడు. అలా సినిమాల గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆయనతో ద్వారానే సినిమాల్లోకి వచ్చాను.ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌ను పరిచయం చేశాడు. అతనే మా సినిమా డైరెక్టర్ రాజేష్ దొండపాటి.
 
- నిర్మాత‌గా ఓ కుటుంబంతోక‌లిసి అంద‌రూ చూసి ఎంజాయ్ చేసేలా ఓ సినిమా తీయాల‌నుకున్నాను. ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలు ఇప్పట్లో అంతగా రావడం లేదు. నాకున్న ఆలోచనలే మా దర్శకుడు రాజేష్‌కి ఉండేవి. అలా మా ఇద్దరి ప్రయాణం మొదలైంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. ఈ కథలో కొన్ని ఇన్ పుట్స్ కూడా నేను ఇచ్చాను.
 
- మా సినిమాలో హీరో గొర్రెల కాపరిగా పని చేస్తాడు. తండ్రి చిన్న‌ప్పుడే చ‌నిపోతాడు. అతని తండ్రి కల ఏంటి?.. ఆ కలను నెరవేర్చే ప్రయత్నంలో ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో సినిమా కథ ఉంటుంది. స్టోరీలో భాగంగా హీరో `కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ `అని చాలా సార్లు చెబుతుంటాడు. అదే మాట ఊరి జనంతో చెప్పించాడా? లేదా అనేదే కథ. మా హీరో రిష్వి తిమ్మరాజులో కాస్త వెరైటీ, కొత్త స్పార్క్ కనిపించింది. ఆడిషన్స్‌కు పంపించిన వీడియోలు చూసి తీసుకున్నాం. హీరోయిన్ పాత్ర కోసం చాలా మంది ఆడిషన్స్ చేశాం. చివరకు విస్మయని తీసుకున్నాం.
 
- సినిమాను తీయడం కష్టమని అంటుంటారు. కానీ నాకు అలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు. నేను మొత్తం యూఎస్‌లోనే ఉండేవాడిని. నా ఫ్రెండ్స్ ఇక్కడ మ్యానేజ్ చేసే వాళ్లు. అయితే మాకు అనుభవం లేకపోవడంతో కాస్త బడ్జెట్ అదుపు తప్పింది. 
మొదటి ప్రయత్నంతోనే విజయం వస్తుందో లేదో చెప్పలేం. నేను నిర్మాతగా కంటిన్యూ చేస్తూనే ఉంటాను. వరుసగా సినిమాలు నిర్మిస్తుంటాను. లాభాలు రాకపోయినా పర్లేదు. రిస్క్ లేకుండా సినిమాలు చేయాలని అనుకుంటున్నాను.
 
- ఇండస్ట్రీలో దిల్ రాజు, అరవింద్, రామానాయుడు అంత ఎదగాలని అనుకుంటున్నాను. సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి క్రియేటివ్ వ్యక్తుల వల్లే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. వారే నాకు స్పూర్తి. ప్రస్తుతం అన్ని రకాలు చిత్రాలు చేయాలని ఉంది. ఎలాంటి డ్రీమ్ ప్రాజెక్టులేవీ లేవు.
 
సినిమా విడుదల విషయంలో దిల్ రాజు గారు, బెక్కెం వేణుగోపాల్ గారు సాయం చేస్తున్నారు. ఆగస్ట్ 4న సినిమా రిలీజ్ అవుతోంది. మూవీని రిలీజ్ చేయడమే అతి పెద్ద విజయంగా అనిపిస్తోంది... అంటూ ఇంట‌ర్వ్యూ ముగించారు ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ నిర్మాత నిర్మాత పెట్లా ర‌ఘురామ్‌ మూర్తి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు