నేను మల్టీ స్టారర్‌కే మొగ్గు చూపేవాడిని - వేణు తొట్టెంపూడి

గురువారం, 28 జులై 2022 (18:42 IST)
Venu Thottempudi,
''దమ్ము'' తర్వాత సినిమాలు చేయకపోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవు. మాకు ఫ్యామిలీ బిజినెస్స్ చాలా వున్నాయి. బిజినెస్ లో బిజీ అయిపోయా. సినిమాల గురించి అలోచించే తీరికే లేకుండాపోయింది. కొంతమంది సినిమా కోసం సంప్రదించినా సున్నితంగా వద్దనే వాడిని- అని న‌టుడు వేణు తొట్టెంపూడి తెలియ‌జేస్తున్నారు.
 
ఆయ‌న ర‌వితేజ న‌టించిన 'రామారావు ఆన్ డ్యూటీస  చిత్రంలో పోలీస్ అధికారిగా న‌టించారు. జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లో రిలీజ్ అవుతుంది. శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. కాగా, ఈ సినిమా గురించి  వేణు తొట్టెంపూడి  విలేఖరుల సమావేశంలో  ప‌లు విష‌యాలు తెలిపారు.
 
ఈ సినిమాలో ఎలా ప్ర‌వేశించారు?
 కరోనాకి థాంక్స్ చెప్పుకోవాలి. కరోనా సమయంలో ఇంట్లో కూర్చుని రకరకాల సినిమాలకు వెబ్ సీరిస్లు చూడ్డం మొదలుపెట్టాను. అప్పుడు మళ్ళీ సినిమాపై ఆసక్తి మళ్ళింది. మంచి పాత్రలు చేయాలనిపించింది. ఇలాంటి సమయంలో దర్శకుడు శరత్  మండవ రామారావు ఆన్ డ్యూటీ కథ చెప్పారు. కథ అద్భుతంగా వుంది. సిఐ మురళిగా నా పాత్ర గురించి చెప్పారు. చాలా బావుంది. ఇలాంటి పాత్ర నేను ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి జోనర్ కూడా  ఫస్ట్ టైమ్. రవితేజ గారి లాంటి  మాస్ స్టార్ సినిమాతో మళ్ళీ నేను రీఎంట్రీ ఇవ్వడం ఆనందంగా వుంది.  
 
సిఐ మురళి పాత్ర చేయడనికి ఆసక్తి కలిగించిన అంశం ?
ఇలాంటి పాత్ర గతంలో ఎప్పుడూ చేయలేదు. అలాగే రామారావు ఆన్ డ్యూటీ  వైడ్ రీచ్ వున్న సినిమా. ఇలాంటి సినిమా చేస్తే నేను మళ్ళీ యాక్ట్ చేస్తున్నాననే విషయం ప్రేక్షకులకు రీచ్ అవుతుందనే ఆసక్తితో ఈ సినిమా చేశా. అలాగే చాలా సక్సెస్ ఫుల్ సినిమాలు చేసినప్పటికీ నాకు నేనుడబ్బింగ్ చెప్పలేదనే చిన్న అసంతృప్తి వుండేది. కానీ రామారావు ఆన్ డ్యూటీలో నేనే డబ్బింగ్ చెప్పడం ఒక తృప్తిని ఇచ్చింది. ఇకపై నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్తా. రామారావు ఆన్ డ్యూటీ తో నాకు మళ్ళీ ఒక ఫ్లాట్ ఫామ్ ఇచ్చిన రవితేజ, సుధాకర్ చెరుకూరి, శరత్ మాండవకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు.
 
స్వయంవరం లో మీతో కలసి చేయాలనీ రవితేజ  గారు చెప్పారు కదా? దాని గురించి ?
నిజంగా దాని గురించి అంతకుముందు నాకు తెలీయదండీ. మొత్తానికి రామారావు ఆన్ డ్యూటీతో మా కాంబినేషన్ కుదిరింది.  మొదటి నుండి నేను మల్టీ స్టారర్ కి మొగ్గు చూపేవాడిని.  'చిరునవ్వుతో' లాంటి సూపర్ హిట్ ఇచ్చినప్పటికీ  వెంటనే హనుమాన్ జంక్షన్ చేశాను. చాలా మంది నటీనటులతో కలసి నటించడం అంటే అదొక పండగ. హనుమాన్ జంక్షన్ కూడా ఒక పండగలా గడిచింది.
 
మీ చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా చేశారు.. తర్వాత ఆయన స్టార్ దర్శకుడయ్యారు..  ఆయన సినిమాల్లో పాత్రల కోసం మిమ్మల్ని ఎప్పుడైనా సంప్రదించారా?
తన సినిమాల్లో నాకు సరిపడే పాత్ర వుంటే ఖచ్చితంగా చెప్తారు. అతడు సినిమాలో సోనూ సూద్ పాత్ర మొదట నాకే చెప్పారు. నేను చేయకపోతే తర్వాత సోను సూద్ చేశారు. ఈ పాత్రకి వేణు బావుంటాడని అనిపిస్తే తప్పకుండా చెప్తారు.
 
రవితేజ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
రవితేజ గారితో పని చేయడం గొప్ప అనుభవం. ఆయన చాలా సింపుల్. డౌన్ టూ ఎర్త్ వుంటారు.
 
మొదటి సినిమాకి ఇప్పటికీ ఒకేలా వున్నారు.. మీ ఫిట్ నెస్ సీక్రెట్ ?
మంచి ఆహరం తినడం తప్ప మరో అలవాటు లేదు. శరీరాన్ని పాడుచేసే ఏ అలవాటు లేదు. సాధ్యమైనంత వరకూ బయట ఫుడ్ కు దూరంగా వుంటాను. ఇక మిగతాది తల్లితండ్రుల ఆశీర్వాదం.
 
సినిమాలని కంటిన్యూ చేస్తారా ?
ఖచ్చితంగా సినిమాలని చేస్తా. అలాగే వెబ్ కంటెంట్ పై కూడా ప్రత్యేకంగా ద్రుష్టి వుంది.
 
కొత్తగా చేయబోతున్న ప్రాజెక్ట్స్ ?
ఛాయ్ బిస్కెట్ నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నా. అలాగే ఒక వెబ్ సిరిస్ కూడా చర్చల్లో వుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు