ప్రేక్షకుడిని, ఓటు వేసేవాళ్లను విశ్లేషించడం మూర్ఖత్వమే - రామ్ గోపాల్ వర్మ
బుధవారం, 15 జూన్ 2022 (16:06 IST)
Ram Gopal Varma
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా 'కొండా'. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి. కొండా సుష్మితా పటేల్ నిర్మాత. జూన్ 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా వర్మతో ఇంటర్వ్యూ...
మీరు ఇంతకు ముందు తీసిన కథలకు, ఈ కథకు వ్యత్యాసం ఏంటి? 'కొండా' సినిమా తీయడానికి మీకు స్ఫూర్తి ఏంటి?
విజయవాడలో చదువుకోవడం వల్ల రౌడీయిజం మీద కొంత అవగాహన ఉంది. 'రక్త చరిత్ర' తీసినప్పుడు రాయలసీమ గురించి తెలిసింది. నేను ఎప్పుడూ తెలంగాణను పట్టించుకోలేదు. రిటైర్డ్ పోలీస్ ఒకరిని కలిసినప్పుడు మాటల మధ్యలో కొండా మురళి గురించి చెప్పారు. ఎన్నికల సమయంలో సురేఖ గారి ఇంటర్వ్యూలు అవీ చూశా. ఆమె గుర్తు ఉన్నారు. కానీ, కొండా మురళి పేరు గుర్తు లేదు. పోలీస్ చెప్పిన తర్వాత మాజీ నక్సలైట్లతో మాట్లాడాను. కొండా దంపతుల జీవితంలో ట్విస్టులు ఉన్నాయి. డ్రామా ఉంది. కథ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత కొండా ఫ్యామిలీని కలిశా. అందరినీ కూర్చోబెట్టి ఇలా అనుకుంటున్నాని చెప్పా. తమ జీవితానికి దగ్గరగా ఉందని అనుకున్నారు. 'మీకు అభ్యంతరం లేకపోతే ప్రొడ్యూస్ చేస్తా' అని సుష్మితా అడిగారు. ముంబై నేపథ్యంలో తీసిన సినిమాలకు, 'రక్త చరిత్ర'కు... ఈ సినిమా నేపథ్యానికి చాలా వ్యత్యాసం ఉంటుంది.
కొండా మురళి జీవితంలో మీకు నచ్చినది ఏంటి?
అన్నిటి కంటే ముఖ్యంగా కొండా మురళి గారి క్యారెక్టర్! ఆయన మాట్లాడే విధానం నచ్చింది. త్రిగుణ్‌లో ఆయన క్యారెక్టరైజేషన్ బాగా కుదిరింది. త్రిగుణ్‌ను చూసినప్పుడు ఇంటెన్స్ యాక్షన్ సినిమా అతడికి బావుంటుందని అనిపించింది. అతను కూడా బాగా చేశారు.
కొండా దంపతుల జీవితంలో కొంత మాత్రమే చూపించనని గతంలో చెప్పారు. అంటే... ఏ కాలాన్ని చూపించారు?
కొండా మురళి, సురేఖ కాలేజీ జీవితం నుంచి రాజకీయ రంగ ప్రవేశం వరకూ ఉంటుంది. అంటే. 1990 నుంచి 2000 వరకూ అనుకోవచ్చు.
'కొండా'లో వాస్తవం ఎంత? కల్పితం ఎంత?
నిజం అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే నిజం తెలిసిన వాళ్ళు తమకు అనుకూలంగా చెప్పుకొంటారు. నాకు నిజం అనిపించిన పాయింట్స్ చెప్పా. నేనూ ఇతరుల నుంచి తెలుసుకున్న సమాచారంలో నమ్మినవి చెప్పాను. కొండా మురళి, సురేఖకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మంచి పనులు చేసినప్పుడు అటువంటి ఫాలోయింగ్ వస్తుంది.
కొండా మురళి పాజిటివ్ పాయింట్స్ చెబుతున్నారా? ఆయనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలను కూడా సినిమాలో ప్రస్తావిస్తున్నారా?
క్రైమ్ అనేది క్రైమ్. అయితే, ఆ క్రైమ్ వెనుక కారణం ఏమిటి? అటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? వంటి అంశాలను ఎలా చూపించాను అనేది 'కొండా'లో చూడాలి. ఒకరిని చంపారు అనుకుందాం. ఎందుకు చంపారు అనేది క్యారెక్టర్ జస్టిఫికేషన్. మనం క్యారెక్టర్‌తో కనెక్ట్ అవడంపై ఉంటుంది.
కొండా దంపతుల కుమార్తె సుష్మిత నిర్మాత కాబట్టి వాళ్ళకు పాజిటివ్ గా తీసి ఉంటారని కొందరు అంటున్నారు!
ఒకవేళ సుష్మిత నిర్మాత కాకపోయియినా ఇదే తీస్తా. నేను 'లక్ష్మీస్ ఎన్టీఆర్' తీశా. 'రక్త చరిత్ర' రెండు భాగాలు తీశా. ఆ సినిమాల్లో పేర్లు దాచలేదు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నిర్మాత అపోజిషన్ అని విమర్శ ఉంది. అది పక్కన పెడితే... నేను తీయాలనుకున్నవి తీశా.
కొండా మురళి ప్రయాణంలో దయాకర్, ఆర్కే ఉన్నారు. సినిమాలో వాళ్ళ పేర్లు ఉపయోగించారా?
ఎవరెవరు ఓకే అన్నారో... అడగటానికి ఎవరు అయితే లేరో... వాళ్ళ పేర్లు అలాగే ఉంచాను.
రాజకీయంగా ఈ సినిమా కొండా కుటుంబానికి ప్లస్ అవుతుందా?
ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కథలో, క్యారెక్టర్ల మధ్య ఉన్న డ్రామా నచ్చి నేను తీశా.
'కొండా'కు సీక్వెల్ తీసే ఆలోచన ఉందా?
వాళ్ళది 30 ఏళ్ళ ప్రయాణం అయితే... నేను 7 నుంచి పదేళ్ళు మాత్రమే తీసుకున్నా. అదీ రెండున్నర గంటల్లో చెప్పడం అసాధ్యం.
సోనియా గాంధీ వరంగల్ వచ్చినప్పుడు కొండా సురేఖ పనితనం గురించి చెప్పారు. అటువంటి తీసుకున్నారా?
అటువంటివి చూపించాను.
మీ సినిమాల్లో నేపథ్య సంగీతం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సినిమాలో ఎలా ఉంటుంది?
ఈ సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్ క్రియేటివ్ ఎలిమెంట్‌గా వాడాను. 'కొండా'లోని హాస్పిటల్ సీన్‌లో నేపథ్య సంగీతం వినండి. కొత్తగా ఉంటుంది.
మీరు ఈ మధ్య పాటలు కూడా పాడుతున్నారు. ఈ సినిమాలో ఏమైనా పాడారా?
గద్దర్ గారితో కలిసి ఈ సినిమాలో పాట పాడాను.
సినిమా బావున్నా, టికెట్ రేట్స్ తగ్గించినా... థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదనే మాట వినబడుతోంది. మీ స్పందన ఏంటి? ఈ సమయంలో థియేటర్లలోకి రావడం సరైన నిర్ణయమేనా?
పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. మనం చేసేది మనం చేస్తాం. పరిస్థితులు ఇంకోటి చేస్తాయి. అదొక సైకిల్. నాలుగు నెలల క్రితం టికెట్ రేట్లు తగ్గించి సినిమాలను చంపేస్తున్నారని అన్నారు. ఆ తర్వాత రేట్లు పెంచారు. ఇప్పుడు మళ్ళీ తగ్గించారు. పరిస్థితులను బట్టి మారాల్సి వస్తుంది. ప్రేక్షకుడిని, ఎన్నికల్లో ఓటు వేసేవాళ్లను విశ్లేషించడం అంత మూర్ఖపు పని ఇంకొకటి ఉండదు.
మీరు ఈ మధ్య తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. 'శివ', 'రంగీలా' నుంచి 'సర్కార్', 'సర్కార్ 2' వరకూ హిందీలో ఎన్నో హిట్స్ తీశారు. మళ్ళీ చేసే ఆలోచన ఉందా?
'లడకీ' హిందీలో తీశా. అమితాబ్ బచ్చన్ గారితో సినిమా ప్లాన్ చేస్తున్నా. అది హారర్ జానర్. నవంబర్ లో స్టార్ట్ కావచ్చు.