నవంబర్ 7న కమల్ హాసన్ కొత్త రాజకీయ పార్టీ

గురువారం, 5 అక్టోబరు 2017 (08:53 IST)
ప్రముఖ తమిళ నటుడు కమల్‌ హాసన్ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. వచ్చే నెల నవంబర్ 7న తన 63వ పుట్టిన రోజును పురస్కరించుకుని రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. బుధవారం చెన్నైలో తన అభిమాన సంఘాల ప్రతినిధులతో సమావేశమై కొత్త రాజకీయ పార్టీపై చర్చించారు. పార్టీ, ఎజెండాపై కూడా తన మనసులోని భావాలను వెల్లడించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఓ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు కమల్‌ అభిమానులకు సంకేతాలిచ్చినట్లు సమాచారం. 
 
వాస్తవానికి వచ్చే యేడాది జనవరిలో రాజకీయ ప్రవేశం చేస్తానని గతంలో కమల్ చెప్పారు. అభిమానులతో సమావేశం అనంతరం కొత్త పార్టీని త్వరగా పెట్టాలని కమల్‌ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తమిళనాడులో రాజకీయ పార్టీలు అవినీతిలో మునిగిపోయాయని, రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మార్చేందుకు రాజకీయాల్లోకి రానున్నట్లు కమల్‌హసన్‌ ఇదివరకే ప్రకటించారు.
 
అయితే, చెన్నైలో జరిగిన అభిమానుల సమావేశంలో కేవలం పుట్టినరోజున చేపట్టే సేవా కార్యక్రమాల గురించి మాత్రమే చర్చించినట్లు కమల్‌హాసన్ వెల్ఫేర్‌క్లబ్ సీనియర్ సభ్యుడు తంగవేలు వెల్లడించడం కొసమెరుపు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు