వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సాగుతున్న కార్తీ

మంగళవారం, 25 మే 2021 (12:38 IST)
kaarti sardar
త‌మిళ న‌టుడు శివ‌కుమార్ రెండో కుమారుడిగా తెలుగులో క‌థానాయ‌కుడిగా గుర్తింపు పొందిన న‌టుడు కార్తీక్ శివ‌కుమార్‌. తెలుగువారికి కార్తి గా సుప‌రిచితం. ఇత‌ని అన్న సూర్య కూడా న‌టుడే. కార్తి త‌ను చ‌వివే రోజుల్లోనే తండ్రి వార‌స‌త్వంగా సినిమాల‌పై మ‌క్కువ ఏర్ప‌రుచుకున్నాడు. ఆయ‌న పుట్టిన‌రోజు నేడే. మే 25న ఆయ‌న జ‌న్మ‌దినం. ఈ సంద‌ర్భంగా స‌ర్దార్ టీమ్ ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ స్టిల్‌ను విడుద‌ల చేసింది.

కార్తి త‌మిళంలోనే సినిమాలు చేశాడు. అవి తెలుగులో డ‌బ్ అయి పేరు తెచ్చ‌కున్నాయి. తెలుగు అనువాదాలకు కార్తీ స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవటం వల్ల తనకి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన కార్తీ 2007లో పరుత్తివీరన్ సినిమా ద్వారా పరిచయమయ్యాడు. ఆ తర్వాత 2010లో అయరతిల్ ఒరువాన్, పయ్యా, నాన్ మహాన్ అల్లా; 2011లో సిరుతై సినిమాల వరుస విజయాల వల్ల కార్తీ తమిళ సినీపరిశ్రమలో గుర్తింపు పొందాడు.
 
2007 వ‌చ్చిన ప‌రుత్తివీర‌న్ సినిమా 2012లో తెలుగులో మ‌ల్లిగాడుగా వ‌చ్చింది. అప్ప‌టినుంచి కార్తి త‌న మాతృక సినిమాలు తెలుగులో విడుద‌ల చేస్తూనే వున్నాడు. ఒక్కో సినిమాకు ఒక్కో భిన్న‌మైన అంశం వుండ‌డంతోపాటు ఆయ‌న తెలుగులోనే డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం ప్ల‌స్‌గా మారింది. యుగానికొక్క‌డు సినిమా తెలుగు ద‌ర్శ‌కుల‌ను ఆలోచింప‌జేసేలా చేసింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన ఆవారా సినిమా ప‌క్కింటి కుర్రాడుగా భావించారు. `నా పేరు శివ‌` సినిమాతో మ‌నింటిలోని అబ్బాయిగా అనిపించాడు. రంగంలో చిన్న పాత్ర వేసిన ఆయ‌న శ‌కుని, బేడ్‌బాయ్స్‌, బిర్యానీ సినిమాలు చేశాడు. 
 
ఎన్‌.టి.ఆర్‌. చేయాల్సిన పాత్ర‌
ఇక తెలుగులో నాగార్జున‌తో `ఊపిరి` చేశాడు. ముందుగా ఎన్‌.టి.ఆర్‌.ను అనుకున్నా ఆయ‌న అందుకు సుముఖంగా లేక‌పోవడంతో కార్తికి ఆ అవ‌కాశం ద‌క్కింది. ఇక ఆ త‌ర్వాత `ఖైదీ` వంటి భిన్న‌మైన సినిమా చేసి అల‌రించాడు. కానీ అనంత‌రం కొన్ని సినిమాలు చేసినా ఏదీ పెద్ద‌గా ఫ‌లితం ద‌క్క‌లేదు. క‌రోనాకు ముందే `సుల్తాన్‌` అనే సినిమా చేసినా తెలుగులో పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఒక‌ర‌కంగా ప్లాప్‌లు చ‌విచూశాడు. 
 
వృద్ధునిగా కార్తి
అలాంటి కార్తి ఇప్పుడు త‌న గురువు మ‌ణిర‌త్నంతో పొన్నియిన్ సెల్వన్ సినిమా చేస్తున్నాడు. ఇది త‌మిళ చారిత్ర‌క నాట‌కం. దీన్ని మ‌ల్టీస్టార‌ర్‌గా రూపొందిస్తున్నారు. మ‌ణిశ‌ర్న భార్య సుహాసిని నిర్మాత‌. ఇందులో విక్ర‌మ్‌, జయంర‌వి, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. కార్తి ఇందులో వ‌ల్ల‌భ‌రాయులు అనే కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు. మ‌రోవైపు విశాల్‌తో `అభిమ‌న్యుడు` సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పి.ఎస్‌. మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో కార్తి `స‌ర్దార్‌` అనే చేస్తున్నాడు. ఇందులో వృద్ధ‌ఛాయ‌లున్న పాత్ర‌ను త‌ను పోషిస్తున్నాడు. ఇలా సినిమా సినిమాకు హిట్‌ల‌తో సంబందంలేకుండా వైవిధ్యాన్ని ప్రేక్ష‌కులు చూపుతున్న కార్తి మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని వెబ్‌దునియా ఆశిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు