జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, రెండు గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మూడవ గీతంగా 'అసుర హననం' విడుదలైంది. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, ప్రేక్షకుల కోసం తెలుగు, తమిళ, హిందీ వ్యాఖ్యాతలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం.
'అసుర హననం' గీతం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. అసురులపై పోరాడుతున్న యోధుడి యొక్క వీరత్వాన్ని చాటిచెప్పేలా సంగీతం, సాహిత్యం ఉన్నాయి. శ్రోతలలో పోరాట స్ఫూర్తిని రగిల్చేలా కీరవాణి సంగీతం శక్తివంతంగా ఉంది. ఆ సంగీతానికి తగ్గట్టుగా గీత రచయిత రాంబాబు గోశాల.. తన పదునైన సాహిత్యంతో కట్టిపడేశారు. "భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం" వంటి పంక్తులతో తన కలం బలం చూపించారు. గాయనీగాయకులు ఐరా ఉడుపి, కాల భైరవ, సాయిచరణ్ భాస్కరుని, లోకేశ్వర్ ఈదర, హైమత్ మహమ్మద్ తమ గాత్రంతో గీతాన్ని మరోస్థాయికి తీసుకెళ్ళారు.
'అసుర హననం' గీతావిష్కరణ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ, సంగీత దర్శకులలో రెహామాన్ ది ఒక శైలి. ఆయన తన సినిమాలలో పనిచేసిన గాయనీగాయకులను వేదికపై పిలిచి గౌరవిస్తుంటారు. వారి పేర్లు కూడా ఆడియోలో వుంటాయి. అలాగే నేను ఈ పాటలను ఈ సినిమాలో పాడిన ప్రతి ఒక్కరిచేత పాడించాను. ఇది మనకు మనం ఇచ్చుకున్న గౌరవం అని అన్నారు.