కర్ణాటకలోని మండ్య లోక్‌సభ స్థానానికి పోటీ చేయడానికి కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో సుమలత స్వతంత్రులుగా బరిలోకి దిగారు. అయితే సుమలత ప్రత్యర్థి దేవెగౌడ కుమారుడు సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కావడంతో అక్కడ రాజకీయం వేడెక్కింది. మరోవైపు సుమలత ప్రచారంలో స్టార్ హీరోలైన కేజీఎఫ్ ఫేమ్ యష్‌ను, హీరో దర్శన్‌ను ప్రచారంలోకి దింపింది. దీనితో జేడీఎస్ నేతలకు భయం పట్టుకుంది.
సుమలతకు అనుకూలంగా ప్రచారం చేస్తున్న హీరోలు యష్, దర్శన్‌లకు అప్పుడే బెదిరింపులు ప్రారంభమయ్యాయి. ఆ హీరోలు తమ వైఖరి అలాగే కొనసాగిస్తే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని జేడీఎస్ నేతలు బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారు. కన్నడ హీరోలు మర్యాదగా తమ ఇళ్లలోనే ఉండాలని ప్రచారం పేరిట జేడీఎస్ నాయకులను విమర్శిస్తే మర్యాదగా ఉండదని హెచ్చరిస్తున్నారు.
ఆ హీరోలు ఏ మాత్రం తోక జాడించినా వారి అక్రమ జాతకాలను వెలికి తీయాల్సి ఉంటుందని బెదిరింపులకు దిగుతున్నారు. ఇలా ఉండగా 'నమ్మ కర్ణాటక రక్షణ వేదిక' అధ్యక్షుడు జయరాజ్ నాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను కోడ్ ఉల్లంఘనగా భావించి తక్షణమే నిలిపివేయాలని ఎన్నికల కమీషన్‌కు వినతి పత్రం ఇచ్చారు.