మా అక్క జాన్వీ కపూర్ చెప్పినట్టుగానే తాను కూడా తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలని వుందని సినీ నటి ఖుషీ కపూర్ అన్నారు. గతంలో జాన్వీ కపూర్ తన పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెల్సిందే. తనకు తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని ఉందని.. భర్తకు సేవ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ తిరుపతిలోనే జీవితాన్ని గడపాలని ఉందని జాన్వీ గతంలో చెప్పారు.
తాజాగా ఈ వార్తలపై ఆమె సోదరి, సినీ నటి ఖుషీ కపూర్ స్పందించారు. తన తాజా చిత్రం 'లవ్ యాపా' ప్రచారంలో భాగంగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుషీ కపూర్ తన పెళ్లి గురించి మాట్లాడారు. అలాగే జాన్వీ కపూర్ కామెంట్స్‌ను కూడా ప్రస్తావించారు.
'గ్రాండ్ పెళ్లి చేసుకోవాలని నాకు చిన్నప్పటినుంచి ఉన్న కల. మా అక్క చెప్పినట్లే నాకూ తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలని ఉంది. నేను ముంబైకి చెందిన అమ్మాయిని. మా పెళ్లి తర్వాత మా నాన్న బోనీకపూర్ మాతోనే ఉండాలని కోరుకుంటాను. మేము ఉండే భవనంలోనే మా నాన్న కూడా ఉండాలి. నేను, నా భర్త.. ఇద్దరు పిల్లలు.. చాలా పెంపుడు కుక్కలు.. జీవితాన్ని ఎప్పుడూ ఇలా ఊహించుకుంటాను' అని చెప్పారు.
జాన్వీలానే మీరు కూడా మీ భర్త తలకు మసాజ్ చేస్తూ సేవ చేస్తారా అని అడగ్గా.. 'నేను అలాంటి సేవలు చేయను' అంటూ సరదాగా బదులిచ్చారు. చిన్నప్పటి నుంచి పెళ్లి అంటే తనకు ఎంతో గౌరవముందని చెప్పిన ఖుషీ.. బంధువులు, స్నేహితుల పెళ్లిళ్లలోను తాను ఉత్సాహంగా పాల్గొని సందడి చేస్తానని గుర్తుచేశారు.