ఈ నె 24వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇవి అక్టోబరు 2వ తేదీ వరకు జరుగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అశోక్ సింఘాల్ తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించేందుకు సమిష్టిగా పనిచేయాలని ఆయన అధికారులను కోరారు. అన్నమయ్య భవన్‌లో ఈవో అధ్యక్షతన జరిగిన శాఖలవారీ సమీక్షా సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వివరించారు.
ఈవో అనిల్ సింఘాల్ మాట్లాడుతూ, 'బ్రహ్మోత్సవాల్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మాడ వీధులు పరిశుభ్రంగా ఉండేలా అదనపు సిబ్బందిని నియమించాలి. గరుడ సేవ రోజు సీనియర్ అధికారులను మాడ వీధుల్లో క్రమబద్ధంగా కేటాయించి, భక్తుల నుంచి స్పందన సేకరించాలి' అని సూచించారు.
అలాగే, గ్యాలరీల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా అన్నప్రసాదాల పంపిణీ, తిరుమల, తిరుపతిలో వాహనాల పార్కింగ్‌కు తగిన ఏర్పాట్లు, నాదనీరాజనం వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని ఈవో ఆదేశించారు. సుమారు 3,500 మంది శ్రీవారి సేవకులను సిద్ధంగా ఉంచే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
పోలీసులతో సమన్వయం, కామన్ కమాండ్ సెంటర్ ద్వారా తిరుమలలోని భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తే ఈసారి బ్రహ్మోత్సవాలు మరింత విజయవంతంగా జరుగుతాయని ఈవో ఆకాంక్షించారు.