చిరంజీవి నోట జై జనసేన... నాటి ప్రజారాజ్యమే నేటి జనసేన!!

ఠాగూర్

సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (09:01 IST)
మెగాస్టార్ చిరంజీవి జై జనసేన అంటూ నినందించారు. ఆ తర్వాత ఆయన చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అయ్యాయి. నాటి ప్రజారాజ్యమే నేటి జనసేన అని వ్యాఖ్యానించారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మెగా ఫ్యాన్స్‌ను తెగ ఖుషీ చేస్తున్నాయి. 
 
విష్వక్‌ సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'లైలా'. సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ నగరంలో జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. ఇందులో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
చాలా రోజుల తర్వాత ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారు. చిరు మాట్లాడుతున్న సమయంలో ఫ్యాన్స్ 'జై జనసేన' అంటూ నినాదాలు చేయడంతో ఆయన కూడా 'జై జనసేన' అని అన్నారు. ఇక చిరంజీవి నోట జై జనసేన అని రావడం ఇదే తొలిసారి. అలాగే నాటి ప్రజారాజ్యం పార్టీనే రూపాంతరం చెంది, జనసేనగా మారిందంటూ మెగాస్టార్ చెప్పుకొచ్చారు. దీంతో చిరు వ్యాఖ్యలపై మెగాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
కాగా, 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ.. ఆ మరుసటి యేడాది జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాల్లో పోటీ చేసి, 18 చోట్ల గెలిచింది. ఆ పార్టీకి 18 శాతం ఓట్లు దక్కాయి. అలాగే చిరు రెండు స్థానాలు పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీ చేశారు. తిరుపతి గెలుపొందారు.
 
ఆ తర్వాత 2011లో పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన అప్పుడప్పుడు పవన్ తీసుకువచ్చారు తప్పితే, చిరంజీవి ఎక్కడ మాట్లాడలేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఇప్పుడు మెగాస్టార్ ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందని చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు