హర్యానా రాష్ట్రంలో పోలీస్ ఉన్నతాధికారులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఇటీవల కులవివక్ష, పోలీస్ ఉన్నతాధికారుల వేధింపుల కారణంగా తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్పీని బదిలీ చేయగా, డీజీపీ శత్రుజీత్ కపూర్‌ను సెలవుపై హర్యానా ప్రభుత్వం పంపించింది. పైగా, పూరన్ కుమార్ ఆత్మహత్య పై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా మరో పోలీస్ ఉన్నతాధికారి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రెండో అధికారి చనిపోయే ముందు రికార్డు చేసిన వీడియోలో ఏడీజీపీ పూరన్ కుమార్‌పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేయడం ఇపుడు కలకలం రేపుతోంది. రోహ్‌తక్‌లో ఈ పోలీస్ ఉన్నతాధికారి తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు.
అయితే, ఆయన ఆత్మహత్యకు ముందు ఒక వీడియోను రికార్డు చేశారు. ఆ వీడియోలో ఇటీవల మరణించిన ఏడీజీపీ పూరన్ కుమార్ ఒక అవినీతిపరుడని, ఆయన అక్రమాలకు పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వీడియోను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులోని ఆరోపణలు పూరన్ కుమార్‌కు సంబంధించినవేనని ధృవీకరించారు. దీంతో వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న అధికారిగా భావిస్తున్న పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది.