ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతల్ని మనసావాచా కర్మణా నిర్వర్తిస్తానని దర్శకుడు క్రిష్ మాటిచ్చారు. ఈ చిత్రంలో నందమూరి తారక రామారావుగా బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. తేజ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న తర్వాత ఎవరు ఆ బాధ్యతల్ని నిర్వర్తిస్తారు? అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే దీనికి తెరదించుతూ చిత్ర బృందం ప్రకటన విడుదల చేసింది. క్రిష్ సినిమాను తెరకెక్కిస్తారని పేర్కొంది.
ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్ సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణకు ధన్యవాదాలు చెప్పారు. ‘నన్ను నమ్మి ఇంత బాధ్యత నాకు అప్పగించిన బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. ఇది కేవలం ఒక సినిమా బాధ్యత కాదు. ప్రపంచంలోని తెలుగు వాళ్లందరి అభిమానానికి, ఆత్మాభిమానానికి అద్దం పట్టే బాధ్యత. మనసా వాచా కర్మణా నిర్వర్తిస్తానని మాటిస్తున్నాను’ అని పోస్ట్ చేశారు.