తల్లాడ వెంకన్న నటించిన ఒక్కడే నెం.1 విడుదల సిద్ధమైంది
సోమవారం, 23 అక్టోబరు 2023 (12:03 IST)
Tallada Venkanna, c. Kalyan, Ambika Krishna and others
క్లాసిక్ సినీ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త తల్లాడ వెంకన్న హీరోగా నటించిన చిత్రం ఒక్కడే 1. సునీత, శృతిక, మధువని కథానాయికలుగా నటించగా, శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ సినీ, పారిశ్రామిక అతిరథులు ముఖ్య అతిథులుగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా సి. కళ్యాణ్ మాట్లాడుతూ...నేను చాలా సినిమాలు నిర్మించినా.. ఏదో రెండు సినిమాల్లో చిన్న క్యారెక్టర్‌లు చేశాను తప్పితే ఫుల్‌ప్లెడ్జ్‌గా నటించలేదు. ఎందుకంటే నటించడం చాలా కష్టం. కానీ వెంకన్న గారు మాత్రం తొలి చిత్రంతోనే ఈ వయసులో డాన్స్‌లు, ఫైట్‌లు, రొమాన్స్ ఇలా అన్ని రసాలను ఈ చిత్రంతో పండించేశారు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను అకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా విజయంతో వెంకన్నగారు సమాజానికి ఉపయోగపడే మరిన్ని సినిమాలు నిర్మించాలని కోరుకుంటూ యూనిట్ అందరికీ ఆల్‌ది బెస్ట్ చెబుతున్నాను అన్నారు.
చిత్ర హీరో వెంకన్న మాట్లాడుతూ, వ్యాపారవేత్తగా సక్సెస్ అయిన నేను సినిమా రంగాన్ని ఓ ఛాలెంజ్‌గా తీసుకున్నాను. మంచి ప్రొడక్ట్ మార్కెట్‌లోకి వదిలితే తప్పకుండా సక్సెస్ అవుతుంది అనేది బిజినెస్ సక్సెస్ సీక్రెట్. అలాగే మంచి కంటెంట్‌తో సినిమా తీస్తే సక్సెస్ ఆటోమేటిక్‌గా వస్తుందనేది సినిమా హిట్ సీక్రెట్. అందుకే మంచి కథ, కథనాలు, మేకింగ్ వేల్యూస్‌తో ఈ ఒక్కడే 1ను నిర్మించాము. మన టాలీవుడ్ సీనియర్ హీరోలను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేశాను. సినిమా చూసిన సురేష్‌బాబు గారు, ఏషియన్ ఫిలింస్ వారు ఆంధ్ర, తెలంగాణల్లో విడుదలకు చేయటానికి ఒప్పుకోవడం మా సినిమాపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. అలాగే కర్ణాటక నుంచి కూడా బయ్యర్ వచ్చారు. అక్కడ కూడా డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 27న విడుదలవుతున్న మా సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అన్నారు.
ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన నిర్మాతలు, దామోదర ప్రసాద్, అంబికా కృష్ణ, తుమ్మలపల్లి సత్యనారాయణ, దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీవిశ్వనాథ్, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, ఆర్యవైశ్య ప్రముఖులు మాట్లాడుతూ, ఈ చిత్రం విజయం సాధించి యూనిట్ అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నా అన్నారు.