తెలుగు చిత్ర పరిశ్రమలో ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి చెక్కిన పీరియాడికల్ మూవీ బాహుబలి. ఈ చిత్రం గత యేడాది జూలై పదో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అంటే ఈ రోజు (ఆదివారం)తో ఈ చిత్రం ఏడాది పూర్తి చేసుకుంది. 'బాహుబలి ది బిగినింగ్' చిత్రం కేవలం తెలుగుకే పరిమితం కాకుండా దేశ విదేశాలలో తెలుగు సినిమా స్థాయిని పెంచింది. దాదాపు రూ.600 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం బాలీవుడ్ రికార్డులని కూడా తిరగరాసింది.
మొదటి నుంచి ఈ మూవీపై జక్కన్న కనబరచిన ఆసక్తి ప్రశంసనీయం. సినిమాను తీయడమే కాదు, ఆ మూవీని ప్రమోట్ చేసుకోవడం కూడా ఓ కళ అని నిరూపించాడు రాజమౌళి. 'బాహుబలి' సినిమా రిలీజ్ తర్వాత ఏ అవార్డు వేడుక జరిగిన అందులో 'బాహుబలి' పేరు లేనిదే ఆ కార్యక్రమం పూర్తి కావడం లేదు. ఇన్నాళ్లు లైమ్ లైట్‌లోకి రాని ఎందరో నటీ నటులని ఒక్కసారిగా స్టార్స్‌ని చేసింది బాహుబలి చిత్రం.
దాదాపు మూడేళ్ళ పాటు షూటింగ్ జరుపుకున్న 'బాహుబలి' సినిమాకు ఎల్లలు అవధులు అనేవి లేకుండా పోయాయి. విడుదలైన ప్రతీ చోటా ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ఈ చిత్రం కోసం ఎంతగానో కృషి చేసారు.
రాజమౌళి క్రియేట్ చేసిన కొత్త ప్రపంచం మాహిష్మతి రాజ్యం. ఈ రాజ్యంలో ప్రభాస్ అమరేంద్ర బాహుబలిగా, రానా భళ్ళాలదేవుడిగా, రమ్యకృష్ణ శివగామిగా, అనుష్క దేవసేనగా, తమన్నా అవంతికగా, సత్యరాజ్ కట్టప్పగా, నాజర్ బిజ్జల దేవగా ఇలా ఎవరికి వారు తమ పాత్రలలో ఒదిగిపోయి నటించారు. కీరవాణి సంగీతం ఈ చిత్రానికి మరింత బూస్టప్‌నిచ్చింది.