హీరో నుంచి రాజకీయ నేతగా మారిన వ్యక్తి పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ అధినేతగా ఉన్నారు. ఈయన చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించిన చిత్రం 'ఆటగదరా శివ'. ఈ చిత్రం ఈనెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలోని 'ఎట్టాగయ్యా శివ శివ' అనే పాటను పవన్ ఆదివారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, 'చైతన్య ప్రసాద్‌గారి సాహిత్యం చాలా బావున్నాయి. నాకు బాగా నచ్చింది. వాసుకి వైభవ్‌గారు రాసిన శివతత్వం పాట నాకు చాలా బాగా నచ్చింది. హీరో ఉదయ్‌శంకర్ నాకు చిన్నప్పట్నుంచి తెలుసు. ఉదయ్ నాన్న శ్రీరామ్‌గారు మాకు గురువు. మేం ఆయన్ను సార్ అంటుంటాం. ఆయన ఇంగ్లీష్ లెక్చరర్.. నాకు ఆధ్యాత్మిక గురువు కూడా అని వివరించారు.
అంతేకాకుండా తాను నటించిన 'గోకులంలో సీత' సినిమా నుండి ఉదయ్‌ను చూస్తున్నాను. ఉదయ్ నటించిన చిత్రమే 'ఆటగదరా శివ'. ఉరిశిక్ష పడిన ఖైదీ జీవితానికి సంబంధించిన కథాంశం. డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ దర్శకత్వం చేసిన 'ఆ నలుగురు' వంటి సినిమాలు యూనిక్‌గా ఉంటాయి. ఈ సినిమా విజువల్స్ చూస్తుంటే కొత్తగా, డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఉదయ్ శంకర్ పాత్ర కూడా నాకు కొత్తగా అనిపించింది. రెగ్యులర్ హీరోలా కాకుండా ఓ క్యారెక్టర్‌ను ఎష్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం నాకు బాగా నచ్చింది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు.