గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఇకలేరన్న వార్తను సినీ ఇండస్ట్రీతోనేకాదు.. పాటలపై రవ్వంత అభిరుచివున్న ఏ ఒక్కరు కూడా ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా, ఎన్నో దశాబ్దాలుగా అనుబంధం ఉన్న సినీ ప్రముఖులు మాత్రం అస్సలు నమ్మలేకపోతున్నారు. మీ వంటి మహోన్నతమైన గాయకుడు మళ్లీ పుట్టడని కంటతడి పెడుతోంది.
అలాగే, అక్కినేని నాగార్జున.. తనకు బాలుగారితో గడిపిన క్షణాలు, అనుబంధం గురించి వెల్లడిస్తూ, కన్నీటి పర్యంతమయ్యారు. 'అన్నమయ్య' సినిమా తర్వాత ఆయన నుంచి తనకు వచ్చిన ఫోన్‌కాల్ ఇప్పటి గుర్తుందని చెప్పారు. తన జీవితంలో బాలు ఒక భాగమన్నారు. 'దాచుకో స్వామి మా బాలుని జాగ్రత్తగా దాచుకో' అని ట్వీట్ చేశారు.
అదేవిధంగా నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ, 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన గానగంధర్వుడు ఆయనని.. దేశం గర్వించే గొప్ప గాయకుడన్నారు. ఆయన నిష్క్రమణ సినీ, సంగీత ప్రపంచానికే తీరని లోటు అని చెప్పారు. బాలుగారితో తనకు వ్యక్తిగతంగా ఎంతో అనుబంధం ఉందని అన్నారు. ఆయన పాడిన నాన్నగారి పాటలను, తన పాటలను వినని రోజంటూ ఉండదని చెప్పారు.
'భైరవద్వీపం' చిత్రంలో ఆయన ఆలపించిన 'శ్రీ తుంబుర నారద నాదామృతం' పాటను ఎప్పుడూ పాడుకుంటూనే ఉంటానని తెలిపారు. ఆ విధంగా ఆయనను ప్రతిక్షణం తలచుకుంటూ ఉంటానని చెప్పారు. అలాంటి గొప్ప గాయకుడు, గొప్ప వ్యక్తి మనతో లేకపోవడం విచారకరమని అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.