ప్రజలు వెధవలు... ఆర్.జి.వి. కొత్త సినిమా కాన్సెప్ట్ ఇది!
శుక్రవారం, 2 జులై 2021 (13:56 IST)
ఎవరికీ అంతుచిక్కని వ్యక్తిత్వం వర్మది... అవునంటే, కాదంటాడు...కాదంటే అవునంటాడు... చివరికి తనకు మాట మీద నిలబడే అలవాటే లేదంటాడు. ఆర్జీవీ ఓ వింత జీవి అనిపించుకునేలా, ఆయన ఇంటర్వ్యూలుంటాయి. అంతకు రెండింతలు వింతగా ఉంటాయ్ ఆయన సినిమాలు.
తాజాగా ఆర్.జి.వి. కొత్త సినిమా కాన్సెప్ట్.... ప్రజలు వెధవలు! ఈ టైటిల్ తో సినిమా తీస్తున్నానని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. శివ లాంటి సెన్సేషనల్ సినిమాతో దర్శకుడిగా మెరిసి, చివరికి ప్రజలు వెధవలు అనే వరకు వర్మ సినీ ప్రస్థానం సాగుతోంది. గాయం, సత్య లాంటి రియలిస్టిక్ సినిమాలు తీసిన ఆయన... షోలే ను రీ మేక్ చేసి ప్రేక్షకులను వామ్మో అనిపించాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, పవర్ స్టార్ లాంటి పొలిటికల్ సెటైర్ సినిమాలు తీశాడు. ఇలా అన్ని రకాల సినిమాలు తీసి, చివరికి ప్రజలు వెధవలు అనే సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు...
వర్మ ఒక సెన్సేషనల్ డైరెక్టర్ అని చాలా మంది ఆయన్ని అనుసరించాలని ప్రయత్నిస్తుంటారు. పాత కాలంలో ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ కావాలంటేనే చాలా కష్టం అయ్యేది. పెద్ద దర్శకుడి వద్ద ఏళ్ళ తరబడి అసిస్టెంట్ గా పనిచేయాల్సి వచ్చేది. కానీ, ఈ సెన్సేషనల్ డైరెక్టర్ వర్మ దగ్గరికి ఎవరు చిన్న కాన్సెప్ట్ తో వెళ్లినా, నువ్వే డైరెక్టర్... నా బ్యానర్, నా కంపెనీ పేరు మీద చేసుకో... అని డైరెర్టర్ ని చేసేస్తాడు. ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాధ్, కృష్టవంశీ, గుణశేఖర్, తేజ....లాంటి వారు వర్మ కంపెనీ ప్రోడక్టులే. ఇక నిన్నుకోరి, మజిలీ లాంటి హిట్ సినిమాలు తీసిన శివ నిర్వాణ వర్మకు ఏక లవ్య శిష్యుడు. మొదట ఆయన వర్మ దగ్గరకు అవకాశాల కోసం వెళితే... కాళీ లేదన్నాడట. దీనితో అతను దూరంగా ఉంటూనే ఏకలవ్య శిష్యుడిలా రామ్ గోపాల్ వర్మ టేకింగ్ లను ఒడిసి పట్టుకున్నాడు.
ఓటుకు నోటు... కడకు నేతలకే పోటు...
మీరు రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళకూడదు..అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే... నాకంత తీరిక లేదు...అయినా నేను ఎవరికీ సేవ చేయను... అంత ఖాళీ లేదంటూ సమాధానం ఇచ్చాడు. పైపెచ్చు ఓటు వేసి నానారకాల రాజకీయ నాయకుల్ని పెంచి పోషిస్తున్న ప్రజలు వెధవలు అంటూ సినిమా తీస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇక ఆ సినిమా విషయంలో వర్మ కాన్సెప్ట్ ఏంటంటే... మన సమాజంలో ప్రజలు ఎన్నో రకాలుగా విడిపోయారు. రామ్ గోపాల్ వర్మ...ఇలా విడిపోయిన ప్రజలు వెధవలు అని అర్ధం వర్మ అంతరార్ధం.
కులాలు, మతాలు, ప్రాంతీయాలు, పార్టీల అభిమానంతో పాటు, కొందరిపై పిచ్చిగా వ్యక్తిగత అభిమానంతో ఓట్లు ఎలా పడితే అలా వేసేస్తున్నారు. గతంలో ఇలానే ఇందిరాగాంధీ బొమ్మ చూసి ఓట్లు గుద్దేసేవారు. అప్పటి ఇందిరా కాంగ్రెస్ తరఫున ఇందిరా గాంధీ బొమ్మపై గెలిచిన ఎంపీలో అయిదేళ్ళలో ఒక్కసారి కూడా ప్రజలకు కనిపించేవారు కాదు. అయినా ఇందిరమ్మ అభిమానం...అంతే. ఇక ఎన్నికల్లో ఓటుకు నోటు... డబ్బుల పంపిణీ... చివరికి అదే సీన్ మార్చేస్తుంది.
వందలు, నాలుగైదు వేల ఓట్లతో గెలిచే వారిని ఓడించాలంటే, ఆ నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బు వెదజల్లితే చాలు... ఫలితాలు తారుమారు అయిపోతాయి. ఇలా విడిపోయిన ప్రజలు వెధవల్లా ఓట్లు వేసి, స్వార్ధపరులైన నేతల్ని గెలిపించి, చివరికి గెలిచిన వారు అవినీతపరులని గుండెలు బాధుకుంటారు. ఓటు అనే వజ్రాయుధాన్ని దుర్వినియోగం చేసి, నీ నెత్తి మీద నువ్వే చెయ్యిపెట్టుకుని మళ్ళీ ఎందుకు ఏడుస్తావనే కాన్సెప్ట్ తోనే, వర్మ సినిమా ప్రజలు వెధవలు సాగుతుందట. ఈ సినిమా చివరికి ఫెయిల్ అయిందనుకోండి... ఆర్జీవీ చెప్పేది ఒకటే సమాధానం... చూసేవాడిదే తప్పు...తీసే వాడిది కాదు.