తమిళ హీరో విశాల్ మెడపై కత్తి వేలాడుతోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేయడం, అది తిరస్కరణకు గురికావడమే ఆయన చేసిన నేరం. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విశాల్ నామినేషన్ దాఖలు చేయడాన్ని కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది పెద్దలు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి వారిలో దర్శకుడు చేరన్, సీనియర్ హీరో టి.రాజేందర్ తదితరులు ఉన్నారు.
విశాల్ తీసుకున్న నిర్ణయంతో దక్షిణ భారత నటీనటుల సంఘంలోని నిర్వాహకుల మధ్య ఉన్న కోల్డ్‌వార్ నెలకొంది. ఇది నానాటికీ ముదురుతోంది. ఇందులోభాగంగా నటుడు పొన్‌వన్నన్ తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ ఓ లేఖను నిర్వాహకులకు సమర్పించారు. వాస్తవానికి నిర్మాతల మండలిలో మాత్రమే ఇలాంటి పరిస్థితులు కనిపించాయి. తాజాగా నటీనటుల సంఘంలోనూ అదే పరిస్థితి ఏర్పడటం చర్చనీయాంశంగా మారింది.
నటీనటుల సంఘంలో శరత్‌కుమార్ బృందం అవినీతికి పాల్పడిందంటూ ఎన్నికల్లో దిగిన విశాల్ బృందం విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నిర్మాతల మండలి ఎన్నికల్లో కూడా పోటీ చేసి గెలుపొందారు. రెండింటిలోనూ విశాల్ తన హవా చాటుకున్నారు. అయితే ఇటీవల ఆర్‌కే నగర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నించడంతో ఇరువైపులా ఆయనకు వ్యతిరేకత వ్యక్తమైంది.
సినీ సంఘాల్లో కీలకపాత్ర పోషిస్తూ రాజకీయాల్లో అడుగు పెట్టడం సముచితం కాదని పలువురు నిర్వాహకులు సూచించినట్లు సమాచారం. అందులో భాగంగానే విశాల్‌ను రాజీనామా చేయాలంటూ రాధిక, చేరన్, టి.రాజేందర్‌తో పాటు పలువురు నిర్మాతలు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆదివారం చెన్నైలో జరిగిన సర్వసభ్య సమావేశం కూడా కాస్త రసాబాసగా మారడం విశాల్ ప్రతిష్టకు అడ్డు తగిలింది. తక్షణం ఆయన తన పదవులకు రాజీనామా చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.