తన మాజీ భర్త, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆయన మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ మంచి సర్టిఫికేట్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదని, ఆయనకు డబ్బు పిచ్చి లేదని స్పష్టంచేశారు. సమాజానికి, ప్రజలకు మంచి చేయాలన్న తపనే ఆయనను రాజకీయాల వైపు మళ్లించిందని, అందువల్ల ఆయనుకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ఆమె ఏపీ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె గురువారం ఓ వీడియోను రిలీజ్ చేశారు. దయచేసి రాజకీయాల్లోకి తమ పిల్లలను లాగొద్దని కోరారు. అలాగే, వ్యక్తికత జీవితం, మూడు పెళ్లిళ్ల అంశాన్ని కూడా పక్కన బెట్టాలని ఆమె సూచించారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు.
అలాగే, "బ్రో" సినిమాలోని శ్యాంబాబు పాత్రపై ఆమె స్పందిస్తూ ఇటీవల విడుదలైన ఓ సినిమాలోని సన్నివేశాలు వివాదానికి దారితీశాయని తెలిపింది. ఆ వివాదం గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. కాకపోతే పవన్‌పై సినిమా, వెబ్ సిరీస్ చేస్తామని ఇటీవల కొందరు అన్నారు. ఆయన పెళ్లిళ్ళు, భార్యలు, పిల్లల గురించి ఈ సినిమా ఉంటుందని చెప్పారు. ఒక తల్లిగా నా వ్యక్తిగత అభ్యర్థన కోసమే ఈ వీడియో చేస్తున్నా. పరిస్థితులు ఏమైనా సరే దయచేసి పిల్లలను అందులోకి లాగకండి. మా పిల్లలు సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టారు. నా పిల్లల తండ్రి నటుడు, రాజకీయ నాయకుడు. నా పిల్లలనే కాదు. ఏ పిల్లలను, ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగకండి. రాజకీయంగా ఏదానా ఉంటే మీరూమీరూ చూసుకోండి:" అని రేణూ దేశాయ్ విజ్ఞప్తి చేశారు.