హమ్మయ్యా.. బెయిల్ వచ్చింది.. జైలు నుంచి రిలీజ్ కానున్న సంజనా గల్రానీ

శుక్రవారం, 11 డిశెంబరు 2020 (21:30 IST)
మాదకద్రవ్యాల కేసులో అరెస్టు అయిన కన్నడ సినీ నటి సంజనా గల్రానీకి ఎట్టకేలకు బెయిల్ లభించింది. దీంతో ఆమె గత మూడు నెలలుగా అనుభవిస్తూ వచ్చిన జైలు జీవితం నుంచి తాత్కాలికంగా విముక్తి లభించనుంది. ఈ డ్రగ్స్ కేసు కన్నడ చిత్రసీమను ఓ కుదుపు కుదుపింది. ఈ కేసుల సంజనాతో పాటు.. రాగిణి ద్వివేదీ, మరికొంతమందిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. 
 
అయితే, వీరిద్దరూ పలుమార్లు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా నిరాశే మిగిలింది. అయితే, తాజాగా సంజన బెయిల్ పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు సానుకూలంగా స్పందించింది. సంజనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.3 లక్షలకు వ్యక్తిగత బాండ్ సమర్పించాలని, అంతే మొత్తానికి ఇద్దరు వ్యక్తులు సంజనకు ష్యూరిటీ ఇవ్వాలని, హైకోర్టు ఆదేశించింది.
 
అలాగే, నెలలో రెండుసార్లు పోలీసుల ఎదుట హాజరవ్వాలని, విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. ఈ మాదకద్రవ్యాల కేసులో సాక్ష్యాలను దెబ్బతీసేలా వ్యవహరించకూడదని పేర్కొంది. కాగా, ఆరోగ్యపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసినట్టు హైకోర్టు వెల్లడించింది. దీంతో శనివారం ఉదయం ఆమె జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు