హీరో విజయ్ - డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "సర్కార్". నవంబర్ 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఈ చిత్రంలోని కోమలవల్లి పాత్ర తమ అధినేత్రి దివంగత జయలలితను పోలినట్టుగా ఉందని పేర్కొంటూ అధికార అన్నాడీఎంకే శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. దీంతో ఈ చిత్రాన్ని రీసెన్సార్ చేసి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు.
అదేసమయంలో ఈ చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళను రాబడుతోంది. ఇందులోభాగంగా, తొలి రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల మేరకు గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. పైగా, దీపావళికి విడుదలైన చిత్రాలన్నీ తేలిపోవడంతో సర్కార్ మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ఈ పరిస్థితుల్లో ఈ చిత్రంలో లేడీ విలన్ పాత్ర పోషించిన వరలక్ష్మి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అన్నాడీఎంకే పార్టీపై తీవ్ర ఆగ్రహంను ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేసింది. ట్విట్టర్‌లో వరలక్ష్మి శరత్ కుమార్.. ఒక సినిమాని చూసి ఇంతగా భయపడుతున్నారు. మీ ప్రభుత్వం మరీ ఇంత బలహీనమా? మీరు ఏదైతే చేయకూడదో అదే చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీ బలహీనతను మీరు బయట పెట్టుకున్న వారు అయ్యారు. ఇప్పటికైనా మీరు మీ తెలివి తక్కువ పనులు మానేయండి. క్రియేటివిటీకి సంకెళ్లు వేయాలని ప్రయత్నించడం ఏమాత్రం మంచిది కాదు అంటూ వరలక్ష్మి ట్వీట్ చేసింది.