మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా కన్నప్ప నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ చేతుల మీద ఈ పాటను విడుదల చేశారు. బెంగుళూరులోని శ్రీ శ్రీ రవిశంకర్ గారి ఆశ్రమంలో డా.మోహన్ బాబు, విష్ణు మంచు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్, కన్నడ డిస్ట్రిబ్యూటర్ రాక్‌లైన్ వెంకటేష్, నటి సుమలత, భారతి విష్ణువర్ధన్, సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ, నటుడు అర్పిత్ రాంకా, రామజోగయ్య శాస్త్రితో సహా కన్నప్ప బృందంతో ఈ పాటను రిలీజ్ చేశారు.
ఈ చిత్రం భక్తిశ్రద్ధలతో కూడినది, మా మొదటి పాటను శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ఆవిష్కరించడం నిజంగా మా అదృష్టం అని కన్నప్ప టీం తెలిపింది. కన్నప్ప నిర్మాత డా. మోహన్ బాబు మాట్లాడుతూ..శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ ఈ పవిత్ర గీతాన్ని ఆవిష్కరించడం గౌరవంగా భావిస్తున్నాను. కన్నప్ప అనేది శివునితో మమేకం చేయబడిన చిత్రం. ఇదే మా ప్రయాణానికి అపారమైన ఆధ్యాత్మిక విలువను జోడిస్తుంది అని అన్నారు.
శివా శివా శంకరా అంటూ సాగే ఈ పాటను విజయ్ ప్రకాష్ ఆలపించారు. స్టీఫెన్ దేవస్సీ ఆహ్లాదకరమైన బాణీకి.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఇక ప్రభుదేవా కొరియోగ్రఫీ పాటను మరింత అర్థవంతంగా మార్చింది. న్యూజిలాండ్ అందాలను చూసి ఆడియెన్స్ అబ్బురపోయేలా ఈ లిరికల్ వీడియో ఉంది. ఇక హిందీలో ఈ పాటను జావేద్ అలీ పాడగా.. శేఖర్ అస్తిత్వ సాహిత్యాన్ని అందించారు.
ఎంతో పాజిటివిటీని పెంచేలా ఉన్న ఈ పాటతో కన్నప్ప మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. కన్నప్ప సినిమా మేకింగ్, క్వాలిటీ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పేందుకు ఈ ఒక్క పాట చాలు అన్న స్థాయిలో ఉంది. ఈ చిత్రంలో రుద్రుడిగా ప్రభాస్, శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీ మాతగా కాజల్ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో డా. మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి మహామహులెందరో నటిస్తున్నారు. తమిళ, మలయాళీ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 25న కన్నప్ప చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.