టిల్లు రెండు సినిమాల సక్సెస్ తర్వాత, సిద్ధు జొన్నలగడ్డ తన కొత్త చిత్రం జాక్ తో తిరిగి వచ్చాడు. బొమ్మరిల్లు, ఆరెంజ్ ఫేమ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య కథానాయికగా నటించింది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సిద్దు ఫార్మెట్ లోనే వుందని ట్రైలర్ చూస్తే అర్థమయింది. అయితే కథలోని పాయింట్ ఎక్కడా లీక్ చేయలేదు. ఈరోజు అనగా ఏప్రిల్ 10, 2025 గురువారం విడుదలైంది. మరి ఎలా వుందో చూద్దాం.
కథ:
ప్రపంచంలో పేరుపొందిన మేథావి పేరుని కొడుకుకు తల్లి పెడితే, జాక్ (సిద్దుకు)గా పిలిపించుకుంటాడు. చిన్నతనంలోనే అమ్మచనిపోతుంది. నాన్న సీరియర్ నరేష్ మాత్రం జాక్ ఏ ఉద్యోగం చేస్తున్నాడో తెలీకుండా అది సీక్రెట్ ఎవ్వరికీ చెప్పకూడదంటాడు జాక్. చిన్నతనంలోనే తింగరివేషాలు అనుభవించిన నరేష్ కొడుకు ఏంచేస్తున్నాడో కనిపెట్టాలని క్యాట్ స్పై ఏజెన్సీకి చెందిన బ్రహ్మాజీకి అప్పగిస్తాడు. జాక్ కు మాత్రం రా ఏజెంట్ అవ్వాలని ఇంటర్వ్యూలకు హాజరయి తన అతితెలివితేటలతో ఉద్యోగం రాకుండా చేసుకుంటాడు. కానీ ఎలాగైనా ఉద్యోగం చేస్తేనే దేశసేవ చేయాలా? లేకుండానే చేయవచ్చని ఉగ్రవాదులను పట్టుకునేందుకు సాహసిస్తాడు. అదే టైంలో అసలు రాా ఆఫీసర్ ప్రకాష్ రాజ్ తన బ్రుందంతో ఉగ్రవాదులను పట్టుకునేందుకు చార్మినార్ దగ్గరకు వస్తాడు.
అప్పటికే ఓ ఉగ్రవాదిని పట్టుకున్న జాక్ కన్ ఫ్యూజ్ లో మరో ఉగ్రవాది అనుకుని ప్రకాష్ రాజ్ ను పట్టుకుని సీక్రెట్ ప్లేస్ లో దాస్తాడు. మరోవైపు బ్రహ్మాజీ ఏజెన్సీనుంచి ఆయన కూతురు వైష్ణవి కూడా స్వంతగా స్పై అవ్వాలని జాక్ ను ఫాలో చేస్తూ జాక్ పట్టుకున్న వారిద్దరినీ వదిలేస్తుంది. ఆ తర్వాత ఏమయింది? అసలు రా ఏజెంట్ అవ్వాలనే జాక్ కు ఎందుకు అనిపించింది అనేవి మిగిలిన సినిమా.
సమీక్ష:
జాక్ సినిమాలో ప్రధాన ఆకర్షణ నిస్సందేహంగా సిద్ధు జొన్నలగడ్డ. ఆయన లేకుంటే జాక్ పడిపోయేవాడు. కథ పాతదిగా అనిపించినా కూడా ఆయన ప్రేక్షకులను నిమగ్నం చేస్తారు. ఆయన డైలాగ్ డెలివరీ, కామిక్ టైమింగ్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాను ప్రారంభం నుండి ముగింపు వరకు నడిపిస్తాయి. ప్రకాష్ రాజ్ తన పాత్రలో బాగానే నటించాడు, అయితే అది పేలవంగా వ్రాయబడింది. మొదటి భాగంలో కామెడీ కొంతవరకు బాగానే ఉంది, ముఖ్యంగా సిద్ధు, నరేష్ పోషించిన అతని తండ్రి మధ్య సన్నివేశాలు ఎంటర్ టైన్ ఇస్తాయి.
కథపరంగా సీరియస్.కానీ సరదాగా సిల్లీగా ఎలా తీయవచ్చో దర్శకుడు భాస్కర్ ఆవిష్కరించారు. ఇలాంటివి మూడు భాగాలు తన వద్ద వున్నాయని ముందుగానే ప్రకటించాడు. ఇందులో లాజిక్ లు వెతికితే కష్టం. సరదాగా టైం పాస్ మూవీగా చూస్తే బెటర్.
మొదటి భాగంలో ఆసక్తికరమైన కథాంశం ఉంది, కానీ రెండవ భాగంలో సినిమాలో సీరియస్ నెస్ లోపించింది. మొదటి సగం కామెడీ, థ్రిల్స్ ను కొంతవరకు సమం చేసినప్పటికీ, రెండవ సగం విఫలమవుతుంది.
ప్రధాన లోపంగా చెప్పాలంటే.. రా ఏజెంట్లను అసమర్థులుగా చిత్రీకరించారు. వారికంటే టెక్నికల్ లో తోపుగా జాక్ పాత్ర వుంటుంది. టెర్రరిస్టు ఆపరేషన్ పూర్తిగా సిద్ధు పాత్రపై ఆధారపడి ఉంటుంది, ప్రకాష్ రాజ్ వంటి వారిని పక్కన పెడుతుంది. అనేక తార్కిక లోపాలు బయటపడతాయి, కథాంశాన్ని జీర్ణించుకోవడం కష్టం. జాతీయ స్థాయి సంక్షోభాన్ని నిర్వహించడానికి సిద్ధు వంటి రూకీపై ఆధారపడటం ఈ చిత్రం యొక్క అతిపెద్ద లోపాలలో ఒకటి.
వైష్ణవి చైతన్య పాత్ర బలహీనమైన డిటెక్టివ్ సబ్ ప్లాట్ ద్వారా కథలోకి బలవంతంగా నెట్టబడినట్లు అనిపిస్తుంది. ఆ పాత్రలో రొమాన్స్ కూడా చేయించాలని చూసి ఎందుకనో తక్కువగా చూపించాడు దర్శకుడు. తన సీక్రెట్ ఆపరేషన్ ను ఫెయిల్ చేసిన వైష్ణవిని కనీసం కోపగించుకోవడంకానీ తిట్టడంకానీ చేయకపోవడం కథలో ప్రధాన లోపం. అదేవిధంగా నేపాల్ లో ఆపరేషన్, ఉగ్రవాద కోణం పెద్ద ఎట్రాక్టివ్ గా అనిపించవు. అందుకే అవన్నీ లోపంగా వున్నా సిద్ధు జొన్నలగడ్డ నటన మాత్రమే రక్షక కవచంగా మిగిలిపోయింది. అతను లేకుండా, జాక్ సినిమాను చూడలేం.
సాంకేతిక అంశాలు:
నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. RAW సెటప్ చిత్రణ నుండి మొత్తం విజువల్స్ వరకు, ప్రతిదీ చక్కగా నిర్వహించబడింది. సీరియెస్ నెస్ కథలో పాటలు, రొమాన్స్ లేవు. బ్యాక్ గ్రౌండ్ సంగీతం పెద్దగా అతకలేదు. రెండవ భాగంలో ఎడిటింగ్ గజిబిజిగా ఉంది. స్టోరీ ఆరంభంలో ఎ.ఐ. టెక్నాలజీతో చేసిన VFX బలహీనంగా కనిపిస్తుంది.
బొమ్మరిల్లు తర్వాత సరైన హిట్ లేని దర్శకుడు భాస్కర్ మరోసారి నిరాశపరిచాడనే చెప్పాలి. ఉగ్రవాదాన్ని నేపథ్యంగా ఎంచుకుని, దానిని కామెడీతో కలపడానికి ప్రయత్నించడం అనేది కత్తిమీద సాములాంటిదే. ఫెయిల్యూర్ సినిమాకాదుకానీ ఏవరేజ్ సినిమాగా నిలుస్తుంది. మరి ఈ సినిమా రెండు సీక్వెల్స్ చేద్దామనుకున్న దర్శకుడికి ఈ సినిమా ఏం చేస్తుందో చూడాలి.