బెంగాల్ లెజండ్రీ డైరెక్టర్ సౌమిత్ర ఛటర్జీ ఇకలేరు...

ఆదివారం, 15 నవంబరు 2020 (15:31 IST)
ప్రముఖ సీనియర్ నటుడు, లెజెండ్రీ దర్శకుడు సౌమిత్ర ఛటర్జీ ఇకలేరు. బెంగాల్ చిత్ర పరిశ్రమలో మొదట నటుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఆదివారం కన్నుమూశారు. గత 40 రోజులుగా మృత్యువుతో పోరాడిన 85 ఏళ్ల సౌమిత్ర కన్నుమూశారు. తన మృతి అభిమానులకు, చిత్ర పరిశ్రమకు తీరని శోకాన్ని మిగిల్చింది. భారత సినీ పరిశ్రమ మరో దిగ్గజ నటుడిని కోల్పోయిందని సినీలోకం సంతాపం ప్రకటిస్తోంది.
 
కాగా, బెంగాల్ సినీ పరిశ్రమకు చెందిన తొలితరం నటుల్లో సౌమిత్ర ఛటర్జీ ఒకరు. దాదాపు మూడు దశాబ్దాల పాటు చిత్ర సీమలో కొనసాగిన సౌమిత్ర.. బెంగాల్ అభిమానుల ఆరాధ్య నటుడిగా నిలిచాడు. దర్శకుడు సత్యజిత్‌ రే దర్శకత్వంలో 1959లో తెరకెక్కిన 'అపుర్‌ సంసార్' చిత్రం ద్వారా నటుడిగా ఛటర్జీ ప్రయాణం మొదలైంది. 
 
ఆ తర్వాత సత్యజిత్‌ దర్శకత్వంలో ఆయన 14 సినిమాల్లో నటించారు. సత్యజిత్ రేతో పాటు బెంగాలీ దర్శకులు మృణాల్‌ సేన్‌, గౌతమ్ ఘోష్, తపన్ సిన్హా, అపర్జా సేన్, రితూ పర్ణఘోష్ వంటి లెజెండరీ దర్శకులతో కలిసి పని చేశారు. ఈ క్రమంలో మూడు జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు. అంతేకాదు సినిమా రంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుతో పాటు భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషన్‌తో సత్కరించింది. 
 
సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటు ఫ్రాన్స్ హైయ్యెస్ట్ సివిలియన్ అవార్డు 'లీజియన్ ఆఫ్ హానర్'ను 2018లో అందుకున్నారు. రచయితగా, డైరెక్టర్‌గానూ ప్రతిభ చాటిన ఛటర్జీ ఎన్నో పుస్తకాలు రాశాడు. అతని కెరీర్‌లో దాదాపు 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1986లో 'స్త్రీ కి పాత్ర' సినిమాతో దర్శకుడిగా మారాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు