చిత్రపరిశ్రమలో మిల్కీబ్యూటీగా గుర్తింపు పొందిన తమన్నా భాటియా... 20 యేళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకున్నారు. గత 2005లో 'చాంద్ సా రోషన్ చెహ్రా' అనే చిత్రంతో ఆమె నటిగా అడుగుపెట్టి వివిధ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. తాజాగా ఆమె ప్రధాన పాత్రను పోషించిన "ఓదెల-2" చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఓ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన 20 యేళ్ళ సినీ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నిజ జీవితంలో తాను కాలేజీ విద్యను అభ్యసించకపోయినప్పటికీ సినిమాల్లో మాత్రం విద్యార్థినిగా నటించానని తెలిపారు. పరిశ్రమలో 20 యేళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కేరీర్ ప్రారంభించినపుడు ఇన్నేళ్లు కొనసాగుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. అలాగే, తన 21వ పుట్టిన రోజు సందర్భంగా జరిగిన ఒక సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు.
ఆ రోజు షుటింగ్ నుంచి విరామం తీసుకుని ఇంటిలో ఉండగా, ఒక తమిళ పత్రికలో తనను నెంబర్ 1 హీరోయిన్‌గా పేర్కొంటూ ఒక ప్రత్యేక కథనం వచ్చిందన్నారు. అది చదివి తాను కన్నీళ్లు పెట్టుకున్నట్టు చెప్పారు. ఈ స్థాయికి త్వరగా చేరుకుంటానని తాను ఎపుడూ అనుకోలేదన్నారు. నంబర్ 1 స్థానానికి చేరుకున్న తర్వాత ఆ స్థానంలో కొనసాగడం అంత సులువుకాదని ఆమె చెప్పుకొచ్చారు. అది ఒక బాధ్యతగా భావించి ప్రేక్షకులను ఆలరించే విధంగా సినిమాలు చేయాలనే లక్ష్యంతో ఈ స్థాయికి చేరుకున్నానని తమన్నా వివరించారు.