అనంతరం ముఖ్య అతిథి ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ.. "ముందుగా ఇలాంటి ఒక మంచి చిత్రాన్ని, ఒక గొప్ప చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గుండెలకు హత్తుకునేలా సినిమా ఉంటే సూపర్ హిట్ చేస్తామని మరోసారి ప్రేక్షకులు నిరూపించారు. ఇంత మంచి సినిమా తీసిన దర్శకుడికి నా అభినందనలు. ఇలాంటి సినిమాలు తీయడం ఆశామాషి కాదు. దానికి గుండె ధైర్యం కావాలి. ఇది ఆర్ట్ ఫిల్మ్ కాదు.. కానీ ఆర్ట్ ఫిల్మే. ఇది కమర్షియల్ సినిమా కాదు.. కానీ కమర్షియల్ సినిమానే. అలా మాయ చేశాడు దర్శకుడు. ఇది ప్రజల సినిమా, స్టూడెంట్స్ సినిమా, పేరెంట్స్ సినిమా. జీవితంలో గుర్తుండిపోయే ఇలాంటి సినిమా తీసి హిట్ కొట్టిన నిర్మాతకు నా అభినందనలు. హాలీవుడ్ యాక్టర్ సిడ్నీ పోయిటియర్ నటించిన 'టు సర్, విత్ లవ్', ఎన్టీ రామారావు గారి 'బడిపంతులు', హృతిక్ రోషన్ నటించిన 'సూపర్ 30' లాగా ఇది కూడా సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. విద్య, వైద్యం అనేవి ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని రాజ్యాంగ మనకు కల్పించిన హక్కు. కానీ అవి వ్యాపారం అయిపోయాయి. విద్య, వైద్యం వ్యాపారం కాకూడదు. పేదలందరికీ విద్య అందుబాటులో ఉండాలి..దర్శకుడు సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టించాయి. ప్రతి పాత్రను ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. సంయుక్తమీనన్, సాయి కుమార్, సముద్రఖని, తనికెళ్ళ భరణి, హైపర్ ఆది అందరూ అద్భుతంగా నటించారు. కెమెరామెన్ 90ల బ్యాక్ డ్రాప్ ని చక్కగా చూపించారు. ధనుష్ గారు గొప్ప నటుడు. సహజంగా నటిస్తారు. భాషతో సంబంధం లేకుండా అందరికీ దగ్గరైన నటుడు. ఆయన నటనకు సెల్యూట్." అన్నారు.