హాస్య నటుడు గుండు హనుమంతరావు కన్నుమూత

సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (08:57 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్ ఎర్రగడ్డలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు వయసు 61 యేళ్లు. 
 
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ తాను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని వెల్లడించారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ తన అనారోగ్య విషయాన్ని ఎవరికీ తెలియజేయలేదని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వెళ్లడంతో ఆయన ఆర్థికసాయం అందించారు. 
 
కాగా, 1956 అక్టోబర్ 10న విజయవాడలో జన్మించిన గుండు.. 18 ఏళ్ల వయసులోనే నాటకరంగ ప్రవేశం చేశారు. నాటకాల్లో ఆయన వేసిన మొదటి వేషం 'రావణబ్రహ్మ'. ఆ తర్వాత స్టేజీ షోలతో చాలా పాపులర్‌ అయ్యారు. ఇప్పటివకు ఆయన దాదాపు 400లకు పైగా సినిమాల్లో నటించారు. 
 
వెండితెరపై ఆయన కనిపించిన తొలి చిత్రం 'అహ నా పెళ్లంట'. ఆయనకు బాగా పేరు తెచ్చిన సీరియల్ 'అమృతం'. గుండు హనుమంతరావు మూడు సార్లు టీవీ నంది అవార్డులు అందుకున్నారు. ఆయన బాబాయి హోటల్‌, పేకాట పాపారావు, అల్లరి అల్లుడు, మాయలోడు, యమలీల, శుభలగ్నం, క్రిమినల్, అన్నమయ్య, సమరసింహారెడ్డి, కలిసుందాం రా, సత్యం, పెళ్లాం ఊరెళితే, అతడు, భద్ర, ఆట, మస్కా వంటి పలు చిత్రాల్లో నటించారు. గుండు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు