'గద్దలకొండ గణేశ్' నటనకు దర్శకేంద్రుడు ఫిదా...

శనివారం, 21 సెప్టెంబరు 2019 (16:30 IST)
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'గద్దలకొండ గణేశ్'. అసలు ఈ చిత్రం పేరు తొలుత 'వాల్మీకి' అని పెట్టారు. కానీ, 'వాల్మీకి' సామాజిక వర్గానికి చెందిన ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో హైకోర్టు సూచన మేరకు ఈ చిత్రం పేరును గద్దలకొండ గణేశ్‌గా మార్చగా, ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 
 
హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. తమిళ చిత్రం 'జిగిర్తాండా'కు ఈ చిత్రం రీమేక్. ఈ చిత్రం విడుదలైన ప్రతిచోటా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా బాక్సాఫీసు వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 
 
ఈ చిత్రంలో హీరో వరుణ్ తేజ్ ఫ్యాక్షన్ లీడర్‌గా నటించగా, ఆ పాత్రలో అతను జీవించాడు. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. తాజాగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు కూడా ఈ చిత్రాన్ని చూసి వరుణ్ తేజ్‌ను అభినందించకుండా ఉండలేకపోయారు.
 
'నీ నటన అమోఘం వరుణ్ తేజ్. గద్దలకొండ గణేశ్ పాత్రలో నువ్వు పరకాయప్రవేశం చేసిన తీరు నన్ను ముగ్ధుడ్ని చేసింది' అంటూ అభినందనల వర్షం కురిపించారు. అటు దర్శకుడు హరీశ్ శంకర్‌ను కూడా ప్రశంసించారు. భలే వినోదాత్మక చిత్రాన్ని అందించావు హరీశ్ శంకర్ అంటూ మెచ్చుకున్నారు. "ముఖ్యంగా వెల్లువొచ్చే గోదారమ్మ పాట పట్ల చాలా సంతృప్తిగా ఫీలయ్యాను. పూజా హెగ్డే ఆ పాటలో అద్భుతంగా చేసింది" అంటూ కితాబిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు