బాలీవుడ్ సుందరీమణుల్లో విద్యాబాలన్ ఒకరు. ఈమె వివాహమైన పుష్కరకాలమైన ఇంకా సినిమాల్లో రాణిస్తూనే ఉంది. పైగా, మహిళా ప్రధాన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. దీంతో ఆమె భారీ మొత్తంలోనే పుచ్చుకుంటున్నారు. ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ, మూవీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ మార్కెట్ ఉందనీ, అందువల్లే తాను భారీగానే పారితోషికం తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు.
వివాహమైన తర్వాత 12 యేళ్లుగా కేవలం మహిళా ప్రధాన (విమెన్ ఓరియెంటెడ్) చిత్రాలనే చేస్తూవస్తోంది. వాటిని కూడా ఏదిపడితే అది అంగీకరించడం లేదు. తనవద్దకు వచ్చే కథల్లో అభినయానికి మంచి ఆస్కారం ఉండాలి. ముఖ్యంగా, తన బాడీ లాంగ్వేజ్‌కి సరిపోవాలి.. అలాంటి కథలనే ఎంచుకుంటుంది. అందుకే, ఆమెకంటూ ఓ మార్కెట్ కూడా వుంది. ఇక పారితోషికంపరంగా కూడా తాను ఎక్కువే తీసుకుంటానని ఆమె స్వయంగా చెబుతోంది.
'మిగతా వాళ్ల విషయమేమో కానీ, నావరకు నేను బాగానే తీసుకుంటాను. గత 12 ఏళ్ల నుంచీ కేవలం మహిళా ప్రధాన చిత్రాలే చేస్తున్నాను. దాంతో నాకంటూ ఇక్కడ ఓ మార్కెట్ కూడా ఏర్పడింది. దాంతో నా సినిమాలకు మార్కెట్ ఇబ్బంది వుండదు. మార్కెట్టును బట్టే పారితోషికం కూడా ఇస్తారు. నా సినిమాలలో నేనే ప్రధాన పాత్ర పోషిస్తాను కాబట్టి అందరి కంటే ఎక్కువ పారితోషికం తీసుకునేది కూడా నేనే' అని చెప్పుకొచ్చింది.
కాగా, విద్యాబాలన ప్రధాన పాత్రధారిగా టాలీవుడ్ నటి సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం డర్టీ పిక్చర్. ఈ చిత్రంలో విద్యాబాలన్ నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది. అలాగే, పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా వరించాయి. 2014లో పద్మశ్రీ పురస్కారాన్ని పొందింది. ఇక తాజాగా ఆమె హ్యూమన్ కంప్యూటర్‌గా పేరు తెచ్చుకున్న గణిత మేధావి 'శకుంతలాదేవి' బయోపిక్‌లో టైటిల్ రోల్ పోషించింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా శుక్రవారం రిలీజైంది.