సీనియర్ సినీ నటి విజయనిర్మల గుండెపోటు కారణంగా బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆమె వయసు 73 యేళ్లు. ఒక హీరోయిన్‌గానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాణ సంస్థ అధిపతిగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన విజయనిర్మల... దర్శకురాలిగా అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకి ఎక్కారు.
ఆమె సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాణించాలని భావించారు. కానీ, రాజకీయ రంగంలో ఆమె విఫలమయ్యారు. అంతటితో, తనకు రాజకీయాలు అచ్చిరావని నిర్ణయించుకుని, వాటికి దూరంగా ఉన్నారు. 1999లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆమె, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా పోటీ చేయగా, ఎర్నేని రాజా రామచందర్ చేతిలో వెయ్యి ఓట్లకు పైగా తేడాతో ఓటమి పాలయ్యారు. ఆపై ఆమె మరోసారి రాజకీయాల్లోకి కాలు మోపాలని అనుకోలేదు. ఆ ఓటమి దెబ్బతో ఆమె తనకు రాజకీయాలు అచ్చిరావని నిర్ణయించుకుని, క్రియాశీలక రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు.
కాగా, విజయనిర్మల బాలనటిగా ఏడో యేటనే సినీరంగ ప్రవేశం చేసింది. ఈమె అసలు పేరు నిర్మల. అయితే, తనకు సినీ పరిశ్రమలో తొలిసారి అవకాశం ఇచ్చిన విజయ స్టూడియోస్ పట్ల కృతజ్ఞతగా తన పేరును విజయనిర్మలగా మార్చుకున్నారు. దీనికితోడు మరో సీనియర్ నటి నిర్మలమ్మ అప్పటికే చిత్రపరిశ్రమలో ప్రముఖ నటిగా ఉండడం కూడా విజయనిర్మల తన పేరు మార్చుకోవడానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు.